పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి చేసినప్పుడు నిర్వహించిన మిలటరీ ఆపరేషన్లో ఏడుగురు జవాన్లు మరణించారు. వారందరి అంత్యక్రియలు ఈరోజు వారివారి స్వస్థలాలో వేలాదిమంది ప్రజలు, బందుమిత్రుల సమక్షంలో మిలటరీ లాంచనాలతో పూర్తయ్యాయి.
చనిపోయిన వీరజవాన్లలో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్, గరుడ్ కమెండో గురుసేవక్ సింగ్, సుబేదార్ ఫతే సింగ్, హవాల్దార్ కుల్వంత్ సింగ్, సిపాయ్ సంజీవన్ సింగ్, సిపాయ్ జగదీష్ చంద్ర, సిపాయ్ మొహిత్ చంద్ ఉన్నారు.
వారిలో నిరంజన్ కుమార్ కేరళకు చెందినవారు. ఆయన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ లో పనిచేసారు. చనిపోయిన ఒక ఉగ్రవాది శరీరంపై ఉన్న ఒక గ్రెనేడ్ తొలగించే ప్రయత్నంలో చనిపోయారు. ఆయనకు భార్య,రెండేళ్ళ పాప ఉన్నారు. ఆయన తండ్రి ఈ.కె. శివరాజన్ కూడా ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా చేసి రిటైర్ అయ్యారు.
గరుడ్ కమెండో గురుసేవక్ సింగ్ కి పెళ్ళయ్యి ఏడాది మాత్రమే అయ్యింది. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య, తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే చూస్తున్నవారి కళ్ళు చెమర్చసాగాయి.
సుబేదార్ ఫతే సింగ్ వయసు 51సం.లు. 1995 సంవత్సరం.లో జరిగిన మొట్టమొదటి కామన్ వెల్త్ గేమ్స్ క్రీడల్లో ఆయన షూటింగ్ లో భారత్ కి స్వర్ణ మరియు వెండి పతకాలు సాధించారు. ఆయన 2009 సం.లో డోగ్రా రెజిమెంట్ నుండి రిటైర్ అయిన తరువాత డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ (డి.ఎస్.సి.)లో చేరారు. రెండేళ్ళ నుంచి పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు.
హవాల్దార్ కుల్వంత్ సింగ్ (49) స్వస్థలం పంజాబ్ లోని గురుదాస్ పూర్. ఆయన 19ఏళ్ల వయసులోనే ఆర్మీలో చేరారు. ఆయన 2004 సం.లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి 2006సం.లో డి.ఎస్.సి.లో చేరారు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
హవాల్దార్ సంజీవన్ సింగ్ రాణా (51) హిమాచల్ ప్రదేశ్ కి చెందినవారు. ఆయన కూడా డోగ్రా రెజిమెంట్ నుంచి 2009 సం.లో రిటైర్ అయ్యి అదే సంవత్సరంలో డి.ఎస్.సి.లో చేరారు. ఆయనకు తల్లి, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ అప్రకటిత యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్లందరికీ భారత్ నివాళులు అర్పించి తుది వీడ్కోలు పలికింది.