తమన్నా చెప్పింది నిజమే కానీ.. చాలా తెలివిగా చెప్పడంతో ఎవరికీ సరిగా అర్థం కాలేదు. ఇప్పుడు తెలుగులో తమన్నా చేస్తున్న సినిమాల్లో ‘క్వీన్’ ఒకటి. ఈ సినిమా నుంచి డైరెక్టర్ నీలకంఠ తప్పుకున్నాడని రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది. వెంటనే తమన్నా క్లారిటీ కూడా ఇచ్చేసింది. ”నా వల్ల దర్శకుడు మారాడని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నాకు నీలకంఠ గారు అంటే ఎంతో గౌరవం. దర్శకుణ్ణి మార్చే అధికారం నాకు, నా టీంకి లేదు. మా నిర్మాత నవంబరులో సినిమా బాగా రావడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు” అని చెప్పింది తమన్నా. అందులో ఎక్కడా దర్శకుడు తప్పుకున్నాడనే టాపిక్ లేదు. దాంతో ఎవరికీ పెద్దగా డౌట్ రాలేదు. నీలకంఠే సినిమా చేస్తున్నాడని అనుకున్నారు. కానీ, మేటర్ ఏంటంటే… ఇప్పుడు ‘క్వీన్’కి నీలకంఠ డైరెక్టర్ కాదు. కమల్ హాసన్ క్లోజ్ ఫ్రెండ్, నటుడు రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళం, కన్నడ ‘క్వీన్’ రీమేక్స్ తో పాటు తెలుగు రీమేక్ ని కూడా అతడి చేతుల్లోనే పెట్టాడు నిర్మాత.
టోటల్ సౌత్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మీడియంటే ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత మను కుమారన్ ‘క్వీన్’ని రీమేక్ చేస్తున్నారు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్ అగర్వాల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమ మోహన్ టైటిల్ రోల్స్ చేస్తున్నారు. సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు తమిళ్, మలయాళ వెర్షన్స్ కి రమేష్ అరవింద్… తెలుగు, కర్ణాట వెర్షన్స్ కి నీలకంఠని దర్శకులుగా తీసుకున్నారు. ఫారిన్ షెడ్యూల్ చేసిన తర్వాత తెలుగు సినిమాకి డైరెక్టర్ ని మార్చేశారు. ఎందుకనేది తమన్నాకి, నిర్మాతకు తెలియాలి. ఇప్పుడు మాత్రం తెలుగు ‘క్వీన్’ని రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్నాడు. అంతకు ముందు నీలకంఠ తీసిన సన్నివేశాలను మళ్ళీ తీస్తారో? లేదా వాడతారో?