జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ ని కైవసం చేసుకున్నారు అల్లు అర్జున్. పుష్ప చిత్రంలో కనబరిచిన నటనకు గాను అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇదొక చారిత్రాత్మక ఘట్టం. తెలుగు చిత్రం పరిశ్రమ ఎంతోమంది లెజండరీ నటులని ప్రపంచానికి చూపించింది. కానీ ఇప్పటివరకూ ఒక్క హీరోకి కూడా జాతీయ ఉత్తమనటుడు కేటగిరిలో అవార్డ్ రాలేదు. కారణాలు ఏమైనప్పటికీ జాతీయ ఉత్తమనటుడు అవార్డ్ తెలుగు హీరోలకి ఇప్పటివరకూ ఓ అందని ద్రాక్షగా వుంది. ఇప్పుడు తొలిసారి జాతీయ అవార్డ్ అందుకున్న హీరోగా అల్లు అర్జున్ పేరు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుంది.
పాన్ ఇండియా అంచనాలు లేకుండా వచ్చింది పుష్ప. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చిన దర్శకుడు రాజమౌళి.. ‘మీది పాన్ ఇండియా కంటెంట్.. దేశమంతా ప్రచారం చేయాలి” అని సలహా కూడా ఇచ్చారు. ఆయన నోటి మాట మ్యాజిక్ లా పనిచేసిందేమో కానీ ‘పుష్ప’ ఫీవర్ పాన్ వరల్డ్ పాకేసింది. పుష్పగా అల్లు అర్జున్ పాత్ర, మేనరిజం, డైలాగ్స్, డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రేక్షకులతో పాటు, ఎంతోమంది సెలబ్రీటీలని ప్రత్యేకంగా ఆకర్షించింది. హిందీలో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది.
అల్లు అర్జున్ ఈ సినిమా కోసం చాలా ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. తన స్టయిల్ ని పక్కన పెట్టి పుష్ప పాత్రలో పరకాయప్రవేశం చేశారు. అల్లు అర్జున్ లాంటి స్టయిల్ ఐకాన్ పుష్ప పాత్రలో మెడవంకగా పెట్టి, ఆ యాసలో డైలాగులు చెబుతుంటే.. అసలు తెరపైన చూస్తున్నది అల్లు అర్జునేనా అని కాసేపటికి నమ్మబుద్ది కాలేదు. అంతలా ఆ పాత్రలో ఆశ్చర్యపరిచారు ఆలు అర్జున్. దర్శకుడు సుకుమార్ పుష్ప పాత్రని ఎంతలా ప్రేమించారో అంతకంటే ఎక్కువగా ఆ పాత్రబని ప్రేమించి, నమ్మి చేశారు అల్లు అర్జున్. ఇప్పుడా అంకితభావానికి, కష్టానికి తగిన ఫలితం జాతీయ అవార్డ్ రూపంలో దక్కడం చాలా సంతోషం.