ఆంధ్రప్రదేశ్లో కీలక ఎత్తిపోతల పథకాలను నిలిపి వేయాలని… నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టు కూడా ఉంది. అలాగే.. ఉత్తరాంధ్రకు…విశాఖకు మంచినీటిని తరలించేందుకు శరవేగంగా నిర్మించిన పురుషోత్తమ పట్నం ప్రాజెక్టు కూడా ఉంది. వీటితో పాటు.. చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఆపాలని.. ఎన్జీటీ స్పష్టం చేసింది. గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకున్న గోదావరి – పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా నిలిపివేయాలని… జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. నిజానికి ఈ ప్రాజెక్టును ..ఏపీలో కొత్త ప్రభుత్వం రాగానే నిలిపి వేసింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ.. పర్యావరణ అనుమతులు లేవని.. తక్షణం నిలిపి వేయాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ… ఎన్జీటీలో.. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, త్రినాథ్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణజరిపిన ఎన్జీటీ… పర్యావరణ అనుమతులు తీసుకున్న తరవాతే పనులు చేపట్టాలని ఆదేశించింది.
రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలపై ఎన్జీటీకి జాయింట్ కమిటీ నివేదిక ఇచ్చింది. నిజానికి ఏపీ ప్రభుత్వ వాదన ప్రకారం.. పోలవరంలో.. అంతర్భాగంగానే..పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులను నిర్మించారు. పోలవరం అందుబాటులోకి వచ్చిన వెంటనే… ఆ ప్రాజెక్టుల అవసరం తీరిపోతుంది. పోలవరం ద్వారా వాడుకోవాల్సిన నీటిని పట్టిసీమ ద్వారా ఇప్పటికిప్పుడు వాడుకోవడానికి ఆ ప్రాజెక్టులను నిర్మిచామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే.. ఈ వాదనను.. కొత్త ప్రభుత్వం ఎన్జీటీ ముందు… సమర్థంగా వినిపించకపోవడం వల్లే… ఎన్జీటీ నుంచి నిలిపివేత ఆదేశాలొచ్చాయని.. విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికి వరదలు వస్తున్నాయి కాబట్టి .. ఎత్తి పోతల పథకాలు ఉపయోగించడం లేదు. కానీ వరదలు ముగిసిన తర్వాత..అందుబాటులో ఉన్న నీళ్లను.. అవసరమైన చోటకు పంపాలంటే.. ఈ ఎత్తిపోతల పథకాలు చాలా కీలకం. ఈ ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ కూడా అంత ఆసక్తిగా లేకపోవడంతో.. ఇక ఈ ప్రాజెక్టులు కూడా ముందుగు నడిచే పరిస్థితి లేదన్న అంచనాలు రాజకీయవర్గాల్లో వస్తున్నాయి.