కాంగ్రెస్ తొలి కుటుంబం అక్రమాలు యూపీ, ఢిల్లీని దాటాయని కమలనాథులు ఆరోపిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడే సమయానికి దాని నిర్వహణ దారైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎ జె ఎల్) కు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉదారంగా ఖరీదైన స్థలాలను నజరానాగా ఇచ్చాయి. ఇప్పుడవి యంగ్ ఇండియా పేరు మీద సోనియా, రాహుల్ పరమయ్యాయి.
ముంబైలోని బాంద్రాలో 1983లోనే ఎ జె ఎల్ కు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాటును కేటాయించింది. ఇప్పుడు ఆ స్థలంలో 11 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. నెహ్రూ మెమోరియల్ నిర్మించాల్సిన స్థలంలో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని, దీన్ని వాణిజ్య పరంగా ఉపయోగిస్తారని బీజేపీ ఆరోపించింది. దీనిపై విచారణకు తాజాగా మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది.
ఆసక్తికరమైన విషయం ఏమటింటే, ఏజేఎల్ అప్పులు తీర్చడానికి రుణాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. యంగ్ ఇండియా పేరుతో సోనియా, రాహుల్ కు మెజారిటీ షేర్లున్న యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ముంబై ప్లాటులో కాంగ్రెస్ భవన్ పేరుతో నిర్మాణం జరుగుతోంది. ఇదేమి కుంభకోణమని బీజేపీ ప్రశ్నిస్తోంది. నిజానికి ఆ స్థలంలో నెహ్రూ మెమోరియల్, లైబ్రరీ మాత్రమే నిర్మించాలి. మరి దానికోసం 11 అంతస్తుల భవంతి ఎందుకనేది బీజేపీ ప్రశ్న.
హర్యానాలోనూ ఇలాంటి కుంభకోనం జరిగిందని బీజేపీ చెప్తోంది. హర్యానాలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పంచ్ కులా పట్టణంలో ఏజేఎల్ కు3,360 చదరపు మీటర్ల స్థలాన్ని ఇచ్చింది. ఆ సంస్థ ఏమి ఉద్ధరించిందని ఉదారంగా జాగాను పంచిపెట్టిందో అర్థం కాదు. ఇది ప్రజాధనానికి సంబంధించిన విషయం కాబట్టి దీనిపై విచారణ జరిపిస్తామని హర్యానా హర్యానా మంత్రి అనివ్ విజ్ ప్రకటించారు. ఏ ప్రాతిపదికన స్థలం కేటాయించారో తేలుస్తారు. సోనియా, రాహుల్ కు సంబంధం ఉంది కాబట్టే కేటాయించారా లేక మరో కారణం ఉందా అనేది ఆరా తీస్తామని హర్యానా ప్రభుత్వం చెప్తోంది.
ఏజేఎల్ అనేది నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను నడిపే సంస్థ. దానికి ముంబై, హర్యానాల్లో ఖరీదైన స్థలాలను ఉదారంగా ఇవ్వడం పెద్ద కుంభకోణమంటున్నారు కమలనాథులు. విచారణ తర్వాత దోషులపై చర్య తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు.