ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందని స్టింగ్ ఆపరేషన్‌తో బయట పెట్టినా కేసీఆర్ కు జాతీయ స్థాయిలో మద్దతు కనిపించడం లేదు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా లైట్ తీసుకున్నారు. కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలను గురి పెట్టారు. ఏం చేసినా… జాతీయ స్థాయిలో హైలెట్ చేద్దామనుకుంటున్నారు. అందుకే అమిత్ షా, బీఎల్ సంతోష్‌ల పేర్లను బయట పెట్టేలా చేశారు. కానీ ఎలాంటి స్పందన కనిపించడం లేదు.
ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారని ఆడియో టేపుల్లో ఉన్నా కేజ్రీవాల్ స్పందించలేదు. మనీష్ సిసోడియా మాత్రం ముక్తసరిగా స్పందించారు. ఇక బీఆర్ఎస్తో కలిసి పని చేస్తామని ప్రకటించిన కుమారస్వామి స్పందించారు. అంతే కానీ.. మరొక్క జాతీయ, ప్రాంతీయ పార్టీ నేత కూడా కేసీఆర్‌కు సంఘిభావం చెప్పలేదు. పలువురు ఫోన్లు చేశారని మీడియాలో ప్రచారం జరిగింది కానీ అదంతా ప్రచారమే. బీజేపీ ఆకర్ష్‌కు బలైపోయిన శివసేన లాంటి పార్టీలు కూడా స్పందించలేదు. క స్టాలిన్, మమతా బెనర్జీ , నవీన్ పట్నాయక్, పినరయి విజయన్ .. అఖిలేష్ యాదవ్.. ఇలా ఎవరూ స్పందించలేదు.
టీఆర్ఎస్ పార్టీ ఏమైనా విలువలతో కూడిన రాజకీయాలు చేసిందా అన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఎందుకంటే ఆ పార్టీ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు కానీ.. రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు కానీ ప్రతిపక్షం లేకుండా చేసేందుకు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకున్నారు. అందుకే ఈ అంశంలో టీఆర్ఎస్ చురుగ్గా జాతీయ స్థాయిలో హైలెట్ చేయలేకపోతోందన్న వాదన వినిపిస్తోంది. ఇతర పార్టీల నేతలు కూడా ..తాము సమర్థిస్తే.. ఇదే అంటారన్న భావనతో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే అనుకున్నంతగా మద్దతు రాలేదంటున్నారు.