ఒకానొకప్పుడు తెలుగు ప్రజల ఇళ్ళను టీవీలు ఆక్రమించక ముందు రాష్ట్రమంతటా సాహిత్య పరిమళాలు గుబాళించేవి. అనేక మంది రచయితలు పోటీలు పడి మరీ రచనలు చేస్తుంటే వాటిని తెలుగు ప్రజలు చదవి తనివితీరా ఆస్వాదించేవారు. పత్రికా రంగం కూడా మూడు పూవులు ఆరు కాయలుగా సాగేది. తెలుగు సినిమాలలో సైతం ఆ సాహిత్య పరిమళాలు విరజిమ్మేవి. తెలుగు ప్రజల సాహిత్యభిరుచి ఎంతగా ఉండేది అంటే వారు వ్రాసుకొనే సాధరణమయిన ఉత్తరాలలో కూడా సాహిత్య ప్రసక్తి కనబడుతుండేది. తెలుగు సాహిత్యానికి అదొక స్వర్ణ యుగం. ఆ స్వర్ణ యుగంలోనే ఓల్గా కూడా తన సాహిత్యంతో తెలుగు ప్రజలను ఓలలాడించారు.ఆమె కలం నుండి జాలువారిన సజజ, కన్నీటి కెరటాల వెన్నెల, ఆకాశంలో సగం వంటి నవలలు, రాజకీయ కధలు, ప్రయోగం వంటి కధలు, వాళ్ళు ఆరుగురు వంటి నాటికలు, కవితలు, కధానికలు, అనువాద కధలతో తెలుగు ప్రజలను మెప్పించారు.
ఆమె రచించిన విముక్త అనే కధా సంపుటికి 2015సం.కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపిక చేసారు. ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి. ఓల్గా అనేది ఆమె కలం పేరు. కానీ ఆమె ఓల్గాగానే ప్రజలకు, సాహితీ అభిమానులకు సుపరిచితులు. ఆమె నవంబర్ 27, 1950న గుంటూరులో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేసి తెనాలిలో వీఎస్ఆర్-ఎన్వీఆర్ కళాశాలలో 1973 నుంచి 86 వరకు అధ్యాపకురాలిగా పనిచేశారు. 1986 నుంచి సుమారు ఎనిమిదేళ్ళపాటు సినీ రంగంలో కూడా పనిచేసారు. అస్మిత అనే స్వచ్చంద సంస్థతో కలిసి మహిళల సమస్యలు, హక్కుల కోసం పోరాడారు. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు విభాగానికి సలహాదారుగా సేవలు అందించారు. ఆమె ఒక మంచి రచయితగా, మానవతావాదిగా, ఉద్యమకర్తగా ప్రజలకు సుపరిచితులు. ఆమె రచించిన స్వేచ్చ, ఆకాశంలో సగం నవలలకు ఉత్తమ నవలలుగా అవార్డులు అందుకొన్నారు. ‘తోడు’ అనే సినిమాకు ఆమె అందించిన కధకు 1997లో నంది అవార్డు అందుకొన్నారు. ఇంకా అనేక అవార్డులు, సాహితీ సన్మానాలు పొందారు. నేడు సాహితీ రంగంలో కెల్లా అత్యన్నత పురస్కారమయిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపిక అవడం సాహితీ ప్రియులు అందరికీ చాలా సంతోషం కలిగించే విషయమే.