కేసీఆర్ జాతీయ పార్టీ సన్నాహాలు జాతీయ మీడియాకు పండగలా మారాయి. రాజకీయ పార్టీకి ప్రచారం ఎంత ముఖ్యమో కేసీఆర్ కు తెలుసు. ఆ ప్రచారాన్ని ఇప్పుడు మీడియా సంస్థలు ఉచితంగా ఇచ్చే అవకాశం కూడా లేదు. కనీసం కవరేజీ కూడా ఇవ్వరు. అందుకే ఆయన పూర్తి స్థాయిలో పెయిడ్ ప్రచారం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధాన మీడియా గ్రూపులన్నింటికీ ఇప్పటికే .. రూ. పది కోట్లకుపైగా ప్యాకేజీలతో ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు.అయితే అన్నీ ప్రభుత్వ తరపునే.
ఇప్పుడు జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత పార్టీ పరమైన ప్రకటనలు పెద్ద ఎత్తున ఇవ్వనున్నారు. దసరా రోజు నుంచి జాతీయ మీడియాలో కేసీఆర్ పార్టీ గురించి హోరెత్తిపోయేలా ప్రకటనలు ఇచ్చేందుక ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఈ మేరకు ప్రముఖ యాడ్ ఏజెన్సీలతో పాటు నిపుణులు కూడా కంటెంట్ రెడీ చేశారు. ఎలా ప్రచారం జరగాలి. .ఎలా క్రేజ్ తెచ్చుకోవాలన్న స్ట్రాటజీని కేసీఆరే డిసైడ్ చేశారు.
ఇక సోషల్ మీడియా సంగతి చెప్పాల్సిన పని లేదు. బలమైన టీం టీఆర్ఎస్కు ఉంది. టీఆర్ఎస్కు ఆర్థికంగా బలమైన వనరులు ఉన్నాయి. వందల కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే… తెలంగాణ మోడల్ వర్సెస్ గుజరాత్ మోడల్ అన్నట్లుగా చర్చ జరిగేలా చూడాలని భావిస్తున్నారు. అప్పుడే మోదీ పాలన వైఫల్యాలు బయట పడతాయని.. తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుగుతుందని .. అలా జరిగినప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర బలంగా వేస్తారని నమ్ముతున్నారు. ఎలా చూసినా..కేసీఆర్ జాతీయ పార్టీతో నేషనల్ మీడియా సంస్థలన్నింటికీ కలిపి రెండు, మూడు వందల కోట్ల వరకూ ఆదాయం సమకూరడం ఖాయంగా కనిపిస్తోంది.