భారత రాష్ట్ర సమితిని జాతీయ మీడియా పెద్దగా పట్టించుకోలేదు. ఆయన తన పార్టీ పేరును మార్చుకున్నారని లైట్ తీసుకున్నారు…కానీ జాతీయ రాజకీయాల్లో దున్నేసేందుకు వచ్చారని చెప్పడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. భారత రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభోత్సవానికి కేసీఆర్ కూడా అనుకున్నంతగా ప్రముఖ నేతల్ని ఆకర్షించలేకపోయారు. మొదటి నుంచి తనతో ఉన్న కుమారస్వామి, తమిళనాడు వీసీకే నేతలతో పాటు అఖిలేష్ యాదవ్ మాత్రమే హాజరయ్యారు. మిగిలిన నేతలెవరూ హాజరు కాలేదు. చివరికి ఆప్ నుంచి కూడా నేతలు రాలేదు.
ప్రస్తుతం జాతీయ మీడియా అంతా..బీజేపీ గుప్పిట్లో ఉంది. చివరికి ఎన్డీటీవీ కూడా అదానీ గుప్పిట్లోకి చేరిపోయింది. ఈ కారణంగా టీఆర్ఎస్కు పెద్దగా ప్రచారం దక్కదు. కానీ కేసీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ మీడియాకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. టీవీ చానళ్లకు అయితే… కొన్ని కోట్లు బడ్జెట్ పెట్టి ప్రకటనలు ఇచ్చారు. అన్నీ తెలంగాణ మోడల్ అభివృద్ధిని గంటల్లెక్కన ఉత్తరాది ప్రజలకు చూపించాయి. అయినప్పటికీ.. కేసీఆర్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవాన్ని ఓ సాదాసీదా విషయంగా ప్రజలకు చెప్పాయి.
ఉత్తరాదిలో మీడియా వ్యవహారాలు.. ప్రచారం వచ్చేలా చూసుకునే బాధ్యతను కేసీఆర్ కవితకు అప్పగించినట్లుగా చెబుతున్నారు. కవిత సిఫారసుతో ఓ ఉత్తరాది జర్నలిస్టును పీఆర్వోగా నియమించారు. ఆయన ద్వారా చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. కానీ కీలకమైన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ విషయంలో మాత్రం అనుకున్నంతగా ప్రచారం తెప్పించుకోలేకపోయారన్న వాదన వినిపిస్తోంది.