టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయాలు, ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఏం పట్టుబడ్డాయన్నదానిపై.. ఐటీ శాఖ ఇంత వరకూ అధికారిక ప్రకటన చేయలేదు. ఏం పట్టుకుపోయారో.. సీఎం రమేష్ మాత్రం… ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామాను మీడియాకు చూపించారు. అయితే.. ఇప్పుడు జాతీయ మీడియా మాత్రం.. ఐటీ శాఖ వర్గాలు చెప్పాయంటూ.. సీఎం రమేష్ కంపెనీల్లో రూ. వంద కోట్ల అవకతవకలు … అనుమానాస్పద లావాదేవీలు జరిగాయనే అంశాన్ని ప్రముఖంగా ప్రచారంలోకి తీసుకు వస్తున్నాయి. ఇందులో రూ. 74 కోట్ల లావాదేవీల్లో నగదు ఎవరికి వెళ్లిందో.. ఐటీ అధికారులు గుర్తించలేకపోయారని.. మరో రూ. 25 కోట్ల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెబుతున్నారు.
అక్టోబర్ పన్నెండో తేదీన… ఐటీ అధికారులు సీఎం రమేష్ ఆఫీసులు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. పలు డాక్యుమెంట్లు సీజ్ చేశారు. అందులో ఎడ్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సబ్ కాంట్రాక్టింగ్ కంపెనీకి ఆరేళ్లలో పన్నెండు కోట్లు చెల్లింపులు చేసిన పత్రాలు ఉన్నాయి. అయితే. ఆ కంపెనీ ఎక్కడ ఉందో.. ఐటీ అధికారులు గుర్తించలేకపోయారని ఐటీ వర్గాలు మీడియాకు చెబుతున్నాయి. అదే సమయంలో వెనక్కి వచ్చిన కమిషన్ రూ. 33 కోట్లకు సంబంధించి రిత్విక్ కంపెనీ ప్రతినిధులెవరూ సమాధానం చెప్పలేదంటున్నారు. అలాగే స్టీల్ సప్లయింగ్ కంపెనీల నుంచి రూ. 12.24 కోట్ల రూపాయలను రిత్విక్ ప్రాజెక్ట్ కంపెనీ అందుకున్నట్లుగా ఓ మెయిల్.. అలాగే.. స్టీల్ సప్లయర్స్ కు కమిషన్ గా రూ. 7.98 కోట్లను ఇచ్చినట్లుగా దానికి ఉన్న అటాచ్ మెంట్ ను గుర్తించారు. అలాగే ఢిల్లీకి చెందిన ఎన్కేజీ కన్ స్ట్రక్షన్స్ అనే కంపెనీకి ఆరు కోట్లు చెల్లించినట్లుగా రికార్డుల్లో చూపించారు. కానీ దానికి సంబంధించిన బిల్లులు దొరకలేదు. అలాగే కంపెనీకి చెందిన రూ. 2.97 కోట్లను.. రుణంగా.. సొంత అవసరాలకు వాడుకున్నట్లుగా గుర్తించారు. ఏఏకే స్టీల్స్, బీఎస్కే స్టీల్స్ అనే కంపెనీల నుంచి రూ. 25 కోట్ల స్టీల్ ను కొన్నట్లు బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ లావాదేవీలను… ఐటీ అధికారులు అనుమానాస్పదంగా భావిస్తున్నారు. రిత్విక్ కంపెనీ నుంచి రూ. 8.4 కోట్ల చెల్లింపులకు … ఆధారాలు చూపించలేకపోయారని ఐటీ వర్గాలు మీడియాకు లీక్ చేశారు. అదే సమయంలో.. సీఎం రమేష్ ఇంట్లో రూ. 13 లక్షల నగదు, మూడు వేల అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకన్నట్లు చెబుతున్నారు.
ఐటీ వర్గాలు మీడియాకు లీక్ చేసిన విషయాల్లో… కంపెనీకి సంబంధించి న ఆర్థిక వ్యవహారాల్లో రూ. వంద కోట్లు తేడా ఉన్నట్లుగా గుర్తించారు. రిత్విక్ లో సీఎం రమేష్ డైరక్టర్ గా ఉన్నారని చెబుతున్నారు. కానీ.. ఎంపీగా ఎన్నికలవడానికి ఆరు నెలల ముందుగానే కంపెనీల నుంచి తప్పుకున్నానని… సీఎం రమేష్ ప్రకటించారు. అలాగే.. ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా పత్రాల్లో మూడున్నర లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు ఉందన్న విషయాన్ని ఆయన బయటపెట్టారు. దానికి విరుద్ధంగా ఢిల్లీలోని ఐటీ వర్గాలు.. సీఎం రమేష్ కంపెనీల్లో రూ. వంద కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తించినట్లు మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఈ విషయంలో మరిన్ని ఆసక్తికర పరిణామాలు… ముందు ముందు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.