తెలంగాణ ఆర్టీసీ కార్మికులను నానా విధాలుగా ఏడిపించి ‘ధిక్కారమున్ సైతునా’…అంటూ వికటాట్టహాసాలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మీడియా సమావేశాల్లో ఎంతటివాడినైనా లెక్క చేయకుండా, పురుగును చూసినట్లు చూస్తూ మాట్లాడే సీఎం ఢిల్లీలో జాతీయ మీడియాకు సమాధానం చెప్పలేక వారిని తప్పించుకొని వెళ్లిపోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘనత వహించిన ముఖ్యమంత్రి జాతీయ మీడియా (ఆంగ్ల, హిందీ పత్రికల, టీవీ ఛానెళ్ల పాత్రికేయులు) ను తట్టుకోలేక గమ్మున వెళ్లిపోవల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మరి ఆయన చేసిన పని అట్లా ఉంది. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు వరాలివ్వగానే కేసీఆర్ ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. ఆయన షెడ్యూలులో ఓ పెళ్లి కార్యక్రమం కూడా ఉంది. ఢిల్లీలో విమానం దిగగానే విమానాశ్రయంలోనే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
సీఎం విమానం దిగిన తరువాత జాతీయ మీడియా ప్రతినిధులు ఆయన్ని చుట్టుముట్టారు. ఇలాంటి వీఐపీలు ఎవరొచ్చినా ఇది సహజమే కదా. విలేకరులు ఆయనను రాజకీయ ప్రశ్నలు అడగలేదు. ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడలేదు. ఏపీ సీఎం జగన్‌తో ఆయన రిలేషన్స్ గురించి అడగలేదు. ఇలాంటి ప్రశ్నలు అడిగితే వెంటనే సమాధానం చెప్పేవాడేమో. కాని వారు ‘కేసీఆర్ గారూ… దిశ కుటుంబాన్ని మీరు ఎందుకు పరామర్శించలేదు’..అని సింపుల్‌గా అడిగారు. అంతే….ఒక్క మాటా మాట్లాడకుండా కాన్వాయ్‌లో వెళ్లిపోయారు. కేసీఆర్ ఏం చెబుతాడు? ఆయన దగ్గర సమాధానం ఏదీ?
దిశ ఘటనపై దేశమంతా సంచలనం రేగడం అలా ఉంచండి. హైదరాబాదులోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. షాద్‌నగర్ పోలీసు స్టేషన్ దగ్గర, ఆ తరువాత చర్లపల్లి జైలు దగ్గర వేలాదిమంది గుమికూడి ఆ మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. నిందితులను తమకు అప్పగిస్తే తాము శిక్షిస్తామని, వారికి నరకం చూపిస్తామని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఒక దశలో పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. టీవీ ఛానెళ్లు దిశ ఘటనపై హోరెత్తిపోయాయి. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. గవర్నర్ తమిళిసై దిశ ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కన్నీరు తుడిచారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా విచారణ పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.
ఆమె మొన్నీమధ్యనే రాష్ట్రానికి వచ్చిన వ్యక్తి. అయినప్పటికీ వెంటనే స్పందించి పెద్ద మనసు చాటుకున్నారు. మరి తెలంగాణ బిడ్డ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు వరాలిచ్చి వారిచేత చప్పట్లు కొట్టించుకొని, వారిచేత దేవుడనిపించుకోవాలనే పనిలో ఉండిపోయాడు. తర్వాతైనా వెళ్లవచ్చు కదా. ఆ పనీ చేయలేదు. అసలు ఘటన జరిగిన రోజే ఆయన దిశ ఇంటికి వెళాల్సింది. వారిని ఓదార్చడం, పరామర్శించడం రాష్ట్రాధినేతగా ఆయన కనీస బాధ్యత కాదా? నామమాత్రంగా ఏదో ప్రకటన ఇస్తే సరిపోతుందా? అందుకే జాతీయ మీడియాకు సమాధానం చెప్పే గట్స్ లేక గమ్మున వెళ్లిపోయాడు. దిశ ఘటనపై రాష్ట్రం, దేశం దద్దరిల్లుతున్న సమయంలోనే శ్రద్ధగా పెళ్లిళ్లకు హాజరయ్యాడు.
దిశ ఘటనపై కేసీఆర్ స్పందించలేదంటూ వెంటనే జాతీయ మీడియాలో విమర్శలు చెలరేగాయి. ఇప్పుడు ఢిల్లీలో ప్రత్యక్షంగా చేదు అనుభవం ఎదురైంది. ఘటన జరిగిన రోజే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కుమార్తె పెళ్లికి హాజరయ్యాడు సీఎం. ఆ మరుసటిరోజు పిడమర్తి రవి పెళ్లికి వెళ్లాడు. ఇప్పుడు ఢిల్లీలో పెళ్లికి వెళ్లాడు. కేసీఆర్ స్పందించని తీరుపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు కేసీఆర్ స్పందించడు. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణంగా చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ పరామర్శించలేదు.
ఇంటర్మీడియట్ పరీక్షల మార్కుల కుంభకోణంలో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ స్పందించలేదు. ఇవే కాదు, ఇంకా కొన్ని సందర్భాలున్నాయి. కాని సినీ దర్శకుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్లి అక్కడ కొన్ని గంటలు గడిపాడు. మీరు దర్శకత్వం చేస్తానంటే నేను నిర్మాతగా ఉంటానన్నాడు. చినజీయర్ స్వామి జన్మదినం రోజు శంషాబాదులో ఆయన ఆశ్రమానికి వెళ్లి గంటలకొద్దీ గడిపాడు. కాని దిశ ఇంటికి వెళ్లి వారిని ఓదార్చలేకపోయాడు. వారికి భరోసా ఇవ్వలేకపోయాడు. దటీజ్ కేసీఆర్…!