ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్.. జాతీయంగా ఘోరంగా డ్యామేజ్ అయిపోతోంది. సాధారణంగా దక్షిణాది గురించి పెద్దగా పట్టించుకోని జాతీయ మీడియా.. ఇటీవలి కాలంలో ఏపీ ముఖ్యమంత్రి గురించి కథనాల మీద కథనాలు రాస్తోంది. అందులో.. విధానపరమైన నిర్ణయాలను విశ్లేషించి నేరుగా తుగ్లక్ అని అనేస్తోంది. ఆయన నిర్ణయాలు ఎంత అపరిపక్వంగా ఉంటాయో సెటైరిక్ ప్రోగ్రాములు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఫైనాన్షియల్ మేగజైన్లు అయితే.. జగన్ నిర్ణయాల వల్ల ఎన్ని లక్షల కోట్ల నష్టం వచ్చిందో.. భావితరాలు ఎంత నష్టపోతాయో.. వివరిస్తూ.. ఫుల్ పేజీ ఆర్టికల్స్ రాస్తున్నాయి. ఓ రకంగా జాతీయ మీడియా.. ఏపీ సీఎం పరువును.. తీస్తోంది.
నాన్ వర్కింగ్ సలహాదారు దేవులపల్లి అమర్..!
జగన్ ముఖ్యమంత్రి కాగానే జాతీయ స్థాయిలో మీడియా వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి నెలకు రూ. నాలుగు లక్షల జీతంతో పాటు ఎనిమిది మంది సిబ్బంది, హైదరాబాద్, ఢిల్లీల్లో ఆఫీసులు పెట్టుకునే సౌకర్యాలతో.. దేవులపల్లి అమర్ అనే సాక్షిలోనే పని చేస్తున్న ప్రముఖ జర్నలిస్టుకు సలహాదారు పదవి ఇచ్చేశారు. ఈయన తెలంగాణ ఉద్యమంలో ఏపీ ప్రజలపై అసభ్య విమర్శలు చేసిన చరిత్ర ఉన్న జర్నలిస్టు. అయితే.. ఓ జర్నలిస్టు సంఘంలో కీలకంగా ఉండటంతో.. జాతీయ స్థాయిలో ఆయనకు మంచి పలుకుబడి ఉంటుందని.. ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాకుండా చూసుకుంటారని.. భావించారేమో కానీ… జగన్ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. కానీ ఆయన నెలకు ఠంచన్‌గా జీతాలు తీసుకుంటున్నారు కానీ.. పని చేస్తున్నట్లుగా లేరు. జాతీయ మీడియాలో కనీసం అనుకూల కథనాలు కాదు.. కనీసం వ్యతిరేక కథనాలు రాకుండా కూడా ఆపలేకపోతున్నారు.
జగన్‌కు దగ్గరైన జర్నలిస్టుల బిరుదూ తుగ్లక్కే..!
నిజానికి జగన్ నిర్ణయాలు.. జాతీయ మీడియా తనను తాను కంట్రోల్ చేసుకోలేనంతగా.. కథనాలు రాసేలా చేస్తున్నాయన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే.. శేఖర్ గుప్తా అనే జర్నలిస్టు .. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మీయుడు. ఆయన ది ప్రింట్ అనే మీడియా హౌస్ నడుపుతున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత వచ్చి అభినందించి వెళ్లారు. జగన్ పాదయాత్రపై రామచంద్రమూర్తి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు కూడా. జగన్‌తో నేరుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా.. జగన్ నిర్ణయాలను తప్పు పట్టకుండా ఉండలేకపోయారు. నేరుగా.. తుగ్లక్ అనే పద ప్రయోగం చేసి… కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయనకే అలా ఉంటే.. మిగతా మీడియా సంస్థల గురించి చెప్పాల్సిన పని లేదు.
సలహాలు వినని దానికి సలహాదారులెందుకు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరి మాటా వినే రకం కాదు. సలహాలు ఆయనకు రుచించవు. ఆయనకు ఏది తోస్తే అది చెబుతారు. అది చేయాల్సిందే. ఈ విషయం… ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ ఆయనకు సలహాదారులు మాత్రం 40 మంది వరకూ ఉన్నారు. చివరకు సుపరిపాలనకు సలహాలివ్వడానికి కూడా పెద్ద మనుషుల్ని.. నెలకు రూ. నాలుగు లక్షల జీతాలకు పెట్టుకున్నారు. అసలు సలహాలే తీసుకోని సీఎం వీరందరికీ… ప్రత్యామ్నాయ ఉపాధి పథకంలో భాగంగా… ప్రజాధనం చెల్లిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఈ ముఖ్యమంత్రి అంతే అని సరి పెట్టుకోవాల్సిందే.