సెప్టెంబరు 20… జాతీయ సినిమా దినోత్సవం. సినిమాని పండగలా సెలబ్రేట్ చేసుకొనే దేశంలో సెప్టెంబరు 20కి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఓ కీలకమైన నిర్ణయం తీసుకొంది. రేపు దేశ వ్యాప్తంగా పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్ మూవీ టైమ్స్, డిలైట్ మల్టీప్లెక్స్ లతో టికెట్ రూ.99 లకే అందుబాటులో ఉండబోతోంది. దేశ వ్యాప్తంగా సుమారు 4 వేల స్క్రీన్స్‌లో 99లకే సినిమా చూడొచ్చు, సినీ ప్రియులకు ఇది అరుదైన అవకాశమే. ఇటీవల విడుదలైన ‘స్త్రీ 2’, ‘తుంబాడ్’, ‘వీర్ జారా’ చిత్రాల్ని రేపు అతి తక్కువ ధరకే చూసే అవకాశం ఉంది.
నిజానికి టికెట్ రేట్లపై చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. థియేటర్ వ్యవస్థని కాపాడాలంటే వీక్ డేస్, వీకెండ్స్ టికెట్ రేట్లలో వ్యత్యాసం ఉండాలని ట్రేడ్ వర్గాలు సలహా ఇస్తున్నాయి. వీక్ డేస్ లో థియేటర్లు బోసిబోకుండా ఈ విధానం కాపాడే అవకాశం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో దోపిడీని అరికట్టాలి. అక్కడ తినుబండారాల రేట్లు ప్రేక్షకుల్ని భయపెడుతున్నాయి. చిన్న పిల్లలతో ఓ మధ్యతరగతి కుటుంబం మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే తడసి మోపెడు అవుతోంది. టికెట్ రేట్ కంటే, సమోసా, కూల్ డ్రింక్ రేట్లే చాలా అధికంగా ఉంటున్నాయి. బయట 20 రూపాయలకు దొరికే వాటర్ బాటిల్, మల్టీప్లెక్స్ లో 80 రూపాయలు చెల్లించి కొనాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రేట్లని నియంత్రించకపోతే.. సామాన్యులు మల్టీప్లెక్స్‌లకు దూరం అవ్వడం ఖాయం. వీటిపై మల్టీప్లెక్స్ యూనియన్ దృష్టి పెడితే మంచిది.