బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ పార్టీ కార్యాలయంలో రోజంతా నేతలకు అందుబాటులో ఉన్నారు. అయితే ఆయనను కలిసిన వారంతా తెలంగాణ బీఆర్ఎస్ నేతలే. ఒక్కో ఎమ్మెల్యే కనీసం వంద మందిని తీసుకుని ఢిల్లీ వెళ్లి కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయంలో .. తెలంగాణ నేతలు తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఓ రైతు నేతను.. బీఆర్ఎస్ రైతు విభాగానికి అధ్యక్షునిగా నియమించారు. ఆయన తప్ప ఎవరూ బీఆర్ఎస్ ఆఫీసులో తెలంగాణేతలు కనిపించలేదు. కనీసం కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ఇతర రాష్ట్రాల ప్రజల్ని , ప్రముఖుల్ని రప్పించుకోలేకపోవడం బీఆర్ఎస్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.
జాతీయ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా.. తనకు ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పుకోవడానికైనా మద్దతుదారులను పిలిపించుకోవాల్సి ఉంది. కానీ అలాంటిపని చేయలేకపోయారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి అఖిలేష్ యాదవ్ మాత్రమే వచ్చారు… కానీ ఒక్క నేత కానీ.. పార్టీలో చేరుతామని ఆసక్తి చూపేవారు కానీ కనిపించలేదు. చిన్నాచితకా పార్టీలతో సంప్రదింపులు జరిపినా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో తెలంగాణ నుంచి వచ్చే వారితోనే అభినందనలు అందుకుంటున్నారు.
ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా నేతల్ని కేసీఆర్ ఆకర్షించలేకపోవడం… బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. కనీసం శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ఆయా రాష్ట్రాల నుంచి ఎవరూ రాలేదు. ఏపీ నుంచి చాలా మందిని పిలిచారు కానీ ఒక్కరూ రాలేదు. మహారాష్ట్రలో కొన్నిపార్టీలు విలీనమవుతాయన్నారు కానీ.. వారెవరూ రావడం లేదు. కర్ణాటకలో జేడీఎస్ మిత్రపక్షంగా మారింది కానీ.. సీట్లు ఇవ్వని రాజకీయం కోరుకుంటోంది. కేసీఆర్ ఇప్పుడే ఢిల్లీలో రాజకీయం ప్రారంభించారు. ఆయన ఎప్పుడూ తెలంగాణ నేతలతోనే పనులు చక్కబెడితే.. టీఆర్ఎస్ అనే అనుకుంటారు. ఇతర రాష్ట్రాల వారినీ ఆకర్షిచాల్సి ఉంది.