ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో భారతీయులకు ప్రత్యేకించి తెలుగువారికి ఈరోజు అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. అయితే ఇదే సందర్భంలో ఈ సినిమాకు ఆస్కార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బిజెపి పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వివరాల్లోకి వెళ్తే..
ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంపై స్పందించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం తెలుగు వారికి గర్వకారణం అని వ్యాఖ్యానించిన శ్రీనివాస్ గౌడ్, ఈ సినిమా యూనిట్ ను సీఎం పర్మిషన్ తో ఘనంగా రిసీవ్ చేసుకుంటామని, సినిమాటోగ్రఫీ మరియు పర్యాటకశాఖ తరఫున సత్కరిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా బిజెపి కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు బీఆర్ఎస్ నేతలు. ఆర్ఆర్ఆర్ సినిమాను అధికారికంగా ఆస్కార్ కు పంపకుండా బిజెపి పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని, దక్షిణాదిపై తెలుగువారిపై వారికి ఉన్న చిన్నచూపు కంటిన్యూ చేస్తూ గుజరాతి సినిమా చల్లో షో ని ఆస్కార్ కి పంపించారని కానీ ఆ సినిమా నామినేషన్ల పరిధి దాటి ముందుకు వెళ్లలేక వెనక్కి వచ్చేసిందని, కేంద్రం చిన్నచూపు చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రైవేట్ నామినేషన్ ద్వారా వెళ్లి ఆస్కార్ తీసుకువచ్చింది అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు.
మరి దీనికి బిజెపి నేతలు ఈ విధంగా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి.