హాస్యం, శృంగారం, భయానకం, భీభత్సం, రౌద్రం, శాంతం.. ఇలా మనకు తొమ్మిది రసాలున్నాయి. `మా సినిమా నవరస సమ్మేళనం` అంటూ దర్శక నిర్మాతలు చెప్పేది అందుకే. అయితే ఇవన్నీ పండించడం అంత సామాన్యమైన, సాధారణమైన విషయం కాదు. ఒకే కథలో ఇవన్నీ ఇమడలేవు. ఒక్కో కథలో ఒక్కో ఎమోషన్ ఉంటుంది. అందుకే… కథలు జోనర్లుగా విడిపోయాయి. ఈ తొమ్మిది రసాల్నీ ఒకే చోట చేర్చే ప్రయత్నం చేశారు మణిరత్నం. అదే.. `నవరస`. అరవింద్ స్వామి, సూర్య, సిద్దార్థ్, ప్రకాష్ రాజ్, రేవతి, విజయ్‌సేతుపతి, బాబీ సింహా.. ఇలా పేరెన్నదగిన నటీనటులంతా ఒకే సిరీస్ లో కనిపించడం – గౌతమ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ లాంటి దర్శకులు ఒక్కో కథనీ నడిపించడం ఈ నవరస ప్రత్యేకత. కోవిడ్ కారణంగా నష్టపోయిన తమిళ చిత్రసీమలోని కార్మికుల్ని ఆదుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. మరి ఈ తొమ్మిది కథలూ ఎలా సాగాయి? నవరసాలూ పలికాయా, లేదా?
* శత్రువు (కరుణ)
దర్శకత్వం: బిజోయ్ నంబియార్
నివిడి : 30 నిమిషాలు
`నవరసాలు`లో కరుణని ప్రతిబింబించే కథ ఇది. కరుణ అని దర్శకుడు హింట్ ఇచ్చాడు గానీ, ఇందులో భిన్నమైన భావోద్వేగాలు కనిపిస్తాయి. ప్రశ్చాత్తాపం, క్షమాగుణ, వైరం.. ఇవన్నీ ఈ చిన్న కథలో జొప్పించగలిగాడు. ఈ కథ అందించింది స్వయానా మణిరత్నం.
ఇదో కథ అనేదానికంటే సంఘటన అని చెప్పడం బాగుంటుంది. ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య వెనుక ఉన్న భిన్నమైన భావోద్వేగాల్ని, మనస్తత్వాల్నీ తేటతెల్లం చేశాడు కథకుడు. ఈ ఎపిసోడ్ చూస్తున్నంతసేపూ… ఓ కథ చదువుతున్న భావనే కలుగుతుంది. రేవతి, విజయ్‌సేతుపతి, ప్రకాష్ రాజ్ లాంటి నటీనటులు ఉండడంతో ఈ కథ మరింత రక్తి కట్టింది. టేకింగ్, షాట్ మేకింగ్ ఇవన్నీ చూస్తే… అచ్చంగా మణిరత్నం డైరెక్ట్ చేశాడేమో అన్న భావన కలుగుతుంది. ఓ హత్య చేశాక మనిషి తాలుకూ ప్రశ్చాత్తాపం, తనని వేధించే ప్రశ్నలు, వాస్తవాలూ ఇవన్నీ ఇంత తక్కువ సమయంలో, ఇంత చిన్న పరిధిలో చెప్పడం మెచ్చుకోదగిన విషయాలే. ఓ చిన్న ఆఫ్‌బీట్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
* 1992 వేసవి కాలం (హాస్యం)
దర్శకత్వం: ప్రియదర్శన్
నిడివి: 30 నిమిషాలు
తొమ్మిదో తరగతి నాలుగుసార్లు తప్పి, ఊర్లోంచి పారిపోయిన ఓ కుర్రాడు… ఆ తదుపరి కాలంలో తెలుగు చిత్రసీమలో స్టార్ కమెడియన్ గా ఎదిగి, తిరిగి తన ఊర్లో, తాను చదివిన స్కూల్ లో జరిగే ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చి, పాత జ్ఞాపకాల్ని నెమరేసుకోవడం ఈ ఎపిసోడ్ లో కనిపిస్తుంది. హాస్య రసాన్ని అందించే కథ ఇది. అయితే.. ఆ హాస్యం అనుకున్నంతగా పండలేదు. ఆ కామెడీ స్టార్ గా యోగిబాబు కనిపించాడు. యోగిబాబు కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. కానీ.. దాన్ని సరిగా వాడుకోలేదు. పైగా.. పతాక సన్నివేశాల్లో అశుద్ధాన్ని అంటుకున్న కుక్క.. ఇల్లంతా చిందరవందర చేయడం కాస్త వెగటుగా, వికారంగా అనిపిస్తుంది. స్కూలు రోజుల్లో చిన్నప్పటి యోగిబాబు వేసిన వేషాలూ ఏమంత హాస్యాన్ని పండించవు.
* ఆపరేషన్ అగ్ని (అద్భుతం)
దర్శకత్వం: కార్తీక్ నరేన్
నిడివి: 28 నిమిషాలు
కాలాన్ని మూడుగా విడగొట్టుకున్నాం. భూత – భవిష్యత్ – వర్తమానం అని. సైన్స్ అనండి, జ్యోతిష్యం అనుకోండి… భూత, భవిష్యత్ కాలాలపై దృష్టి పెట్టి, వర్తమానంలో బతకండం మర్చిపోయాం. కొన్ని కొన్ని అనిర్వచనీయమైన ఆనందాల్ని వదిలేశాం. అపారమైన జ్ఞానం కూడా.. శాపం లాంటిదే అనే విషయాన్ని తెల్సుకోలేకపోయాం. ఇవన్నీ తెలియజెప్పే ఎపిసోడ్.. ఆపరేషన్ అగ్ని. ఓ అపారమైన మేధావి కథ ఇది. ఓ సెంటిస్ట్.. భూత కాలంలోకి వెళ్లి, భవిష్యత్ ని కంట్రోల్ చేసే శక్తి సంపాదిస్తాడు. తనకున్న మేధస్సుతో.. కలల ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అయితే… దీని వల్ల తాను ఏం కోల్పోయాడో తెలుసుకుని ఆ తప్పు సరిదిద్దుకోవడానికి చేసే ప్రయత్నం.. ఆపరేషన్ అగ్ని. నిజానికి.. ఇదో సైన్స్ ఫిక్షన్. చాలా మాటలు అర్థం కావు. సైన్స్‌కీ, జ్యోతిష్యానికీ, కాల్పనిన ప్రపంచానికీ ముడి పెడుతూ చెప్పే విషయాలు.. ఓ పట్టాన బుర్ర కెక్కవు. కాకపోతే ఓ హాలీవుడ్ సినిమాని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. చివర్నో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం… అద్భుతః అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ హీరో… అరవింద్ స్వామి. పూర్ణ ఓ చిన్న పాత్రలో కనిపించింది.
* పాయసం (బీభత్సం)
దర్శకత్వం: వసంత్ ఏ.సాయి
నిడివి: 32 నిమిషాలు
అలసత్వం ఉన్న మనిషి ఎదుగుతాడేమోగానీ, అసూయ ఉన్న మనిషి ఎన్నటికీ ఎదగలేడు. అదే మనిషిని అధఃపాతాళానికి తోసేస్తుంది. తాను బాగుపడకపోయినా ఫర్లేదు గానీ, పక్కవాడు ఎదుగుతుంటే ఓర్చుకోలేని నైజం మనిషిది. అలాంటి ఓ పెద్ద మనిషి కథ.. పాయసం. బీభత్స రసం అని చెప్పుకున్నారు గానీ.. అంత బీభత్సమేం ఇందులో కనిపించలేదు. భీభత్సాన్ని అసూయ అని అన్వయించుకుని ఈ కథ రాసుకున్నారేమో.? 1965.. తమిళనాడులోని కుంభకోణంలో జరిగిన కథ ఇది. అప్పటి సనాతన సంప్రదాయ ధర్మాన్ని, బ్రాహ్మణుల ఇంట్లో పెళ్లి వైభోగాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆర్ట్ విభాగపు పనితనం మెచ్చుకోదగినది. మెథడ్ యాక్టర్స్ అంతా… ఈ ఎపిసోడ్ లో కనిపిస్తారు. వాళ్ల అతి సహజమైన నటనతో `పాయసం` రక్తికట్టింది గానీ – ఈ సిరీస్ లో అత్యంత బోరింగ్ గా సాగిన ఎపిసోడ్ ఇదే.
* శాంతి (శాంతి)
దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్
నిడివి: 25 నిమిషాలు
తమిళ కథకులు… యుద్ధం – శాంతి అనగానే ఎల్ టీ టీ ఈ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటుంటారు. ఈ ఎపిసోడ్ కూడా అంతే. మనిషిని చంపే.. ఆయుధం ఓ యంత్రమే కావొచ్చు. కానీ ఆయుధాన్ని వాడేది మాత్రం మనిషే – అనే బలమైన, సున్నితమైన, ఆలోచనాత్మకమైన విషయాన్ని ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. గౌతమ్ మీనన్, బాబీ సింహా.. ప్రధాన పాత్రలు పోషించారు. ఓ కుక్కని రక్షించడం కోసం ప్రాణాల్ని వదులుకున్న యోధుడి కథ ఇది. తమిళుల అస్థిత్వానికి, వాళ్ల పోరాటానికీ ఆలంబనగా నిలిచే కథ ఇది. ఈ ఎమోషన్ చాలామందికి అర్థం కాకపోవొచ్చు. కానీ అర్థమైన వాళ్లకు మాత్రం కచ్చితంగా కొన్ని ప్రశ్నల్ని సంధిస్తుంది. అసలు శాంతి ఉందా, లేదా? అనేది ఆ ప్రశ్నల్లో ఒకటి.
* రౌద్ర (రౌద్రం)
దర్శకుడు: అరవింద్ స్వామి
నిడివి: 35 నిమిషాలు
ఈ మొత్తం సిరీస్ లో… అమితమైన భావోద్వేగాలతో సాగే ఎపిసోడ్ ఇది. అరవింద్ స్వామిలో ఓ మంచి దర్శకుడన్నాడన్న విషయాన్ని రుజువు చేస్తూ సాగుతుంది.
ఈ కథలో ఓ డైలాగ్ ఉంది. ఆడదాని గురించి. ఆడదాన్ని బంగారంతో పోలుస్తూ.
ఆడపిల్ల.. బంగారం రెండూ ఒకటే. బంగారానికి విలువ ఉంది. ఆడదానికి వెల మాత్రమే ఉంది. ఈ కథలో సారం కూడా అదే. కుటుంబ భారాన్ని యోయలేక, తన కన్నబిడ్డల్ని సంతోష పెట్టలేక, తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోలేక.. ఓ తప్పు చేసిన అమ్మ కథ ఇది. అది చూసి ఆ కోపాన్ని ఆ క్షణమే తీర్చుకున్న కొడుకు కథ. ఆ కోపాన్ని మనసులో దాచుకుని… జీవితాంతం మోస్తూ.. క్షణ క్షణాం చస్తూ బతికిన ఓ ఆడపిల్ల కథ. రెహమాన్ సంగీతం, సంతోష్ శివన ఫొటోగ్రఫీ.. ఇంకేం కావాలి? ఓ సినిమా చూస్తున్న అనుభూతి. అరవింద్ స్వామి స్క్రీన్ ప్లే నచ్చుతుంది. గతాన్ని, ప్రస్తుతాన్ని కలుపుతూ సాగే.. స్క్రీన్ ప్లే అది. ఆ ట్విస్ట్ చివర్నోనే తెలుస్తుంది.
* రాహిత్యం (భయానకం)
దర్శకత్వం: ఆర్. ప్రసాద్
నిడివి: 28 నిమిషాలు
అనిశ్చితిని అంగీకరించకపోవడమే భయం- అనే కొటేషన్ తో ఈ ఎపిసోడ్ ప్రారంభమైంది. ఆ అనిశ్చితి ఏమిటో… ఆ భయం ఎందుకో.. ఎపిసోడ్ చివర్లో అర్థమవుతుంది. చేసిన తప్పు.. మనిషిని ఎప్పుడూ భయపెడుతుంటుంది. ఆ భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఎపిసోడ్ లోనూ అదే చెప్పారు. ఓ ముసలివాడైన ధనవంతుడ్ని లోబరుచుకుని, పెళ్లి చేసుకుని, ఆ తరవాత చేతబడి తో అతని అడ్డు తొలగించుకుని, ఆ యావదాస్తినీ అనుభవించే ఓ ముస్లిం అమ్మాయి కథ. చివరికి తాను చేసిన తప్పుకి ఎలాంటి శిక్ష అనుభవించిందో ఈ ఎపిసోడ్ లో చూపించారు. ఓరకంగా ఇది రివైంజ్ డ్రామా. ఆ రివైంజ్ని ఎంత తెలివిగా తీర్చుకున్నాడో.. తెరపై చూపించారు. ముస్లిం సంప్రదాయాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేశారు. ఈ ఎపిసోడ్ హీరో… సిద్దార్థ్. రెండు మూడు పాత్రలతోనే ఈ కథ ముగుస్తుంది. 28 నిమిషాలూ…. మంచి గ్రిప్పింగ్ తో సాగింది.
* ధైర్యానికి మించి (ధైర్యం)
నిడివి: 32 నిమిషాలు
ఓ పని చేయాలంటే, ధైర్యం ఉంటే సరిపోదు. అంతకు మించి ఉండాలన్న కాన్సెప్ట్ తో సాగే ఎపిసోడ్ ఇది. అధర్వ కీలక పాత్రధారి. ఓ గాయపడిన నక్సలైట్‌ని.. సైనికుడు ఆసుపత్రికి తరలిస్తుంటాడు. ఆ ప్రయాణంలో జరిగే కథ ఇది. కాన్సెప్ట్ వరకూ ఓకే. కానీ.. పతాక సన్నివేశాలే అర్థం కావు. కాస్త గందరగోళ పరిచే కథ ఇది. బహుశా.. లోలోతు, అంతరార్థం వేరే ఉందేమో..? అటవీ నేపథ్యం, నక్సలైట్స్ వ్యవహారం కావడంతో ఎపిసోడ్ ఆసక్తిరకంగానే మొదలవుతుంది. అంజలి.. ఎవరి కోసం, ఎందుకోసం ఎదురు చూస్తోందన్న పాయింట్ చాలామందికి అర్థం కాకపోవొచ్చు. ఈ తొమ్మిది ఎపిసొడ్లలో అర్థాంతరంగా ముగించి, ముగింపులో గందరగోళపరచిన ఎపిసోడ్ ఇదే.
* మీటావు నా గిటారు తీగలు (శృంగారం)
దర్శకత్వం: గౌతమ్ మీనన్
నిడివి: 45 నిమిషాలు
ఇదో రొమాంటిక్ జర్నీ. కమల్ అనే మ్యుజీషియన్. అద్భుతమైన ప్రతిభావంతుడు. ఈదేశంలో సంగీతానికి తగిన గుర్తింపులేదని భావిస్తాడు. అమ్మతో కలిసి లండన్ వెళ్లిపోవాలన్నది తన కల. అలాంటి సమయంలోనే ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ఆకర్షిస్తుంది. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. ఆ తరవాత… కమల్ జర్నీ ఎలా మారిందన్నదే కథ. గౌతమ్ మీనన్ రొమాంటిక్ చిత్రాల కింగ్. ఆ విషయం ఈ ఎపిసోడ్ లో మరోసారి నిరూపితమవుతుంది. నాయకా నాయికల మధ్య పరిచయం, వాళ్లు తమ ప్రేమని వ్యక్తపరచుకోవడం ఇవన్నీ గౌతమ్ స్టైల్ లోనే సాగాయి. ఇద్దరు సంగీతకారులు ప్రేమించుకుంటే.. వాళ్ల ప్రేమలోని గాఢతలోనూ స్వరాలే ప్రతిబింబిస్తాయి. ఈ ఎపిసోడ్ లోనూ అదే జరిగింది. హీరోయిన్ ఆడిట్యూడ్, తన బాడీ లాంగ్వేజ్.. అన్నీ కొత్తగా అనిపిస్తాయి. సూర్యతో పోటీ పడి నటించింది. ఆమె కళ్లల్లోనే ఎక్స్ప్రెషన్స్ పలికాయి. 45 నిమిషాల ఎపిసోడ్ ఓ చిన్న సినిమాని తలపించింది. మధ్యలో హృద్యమైన పాటలు ఆకట్టుకుంటాయి. అయితే.. క్లైమాక్స్ లో మళ్లీ చిన్న గందరగోళం. వారిద్దరూ విడిపోయారా? లేదంటే.. అదంతా కలా? లేదంటే.. తను చనిపోయిందా? అనే రకరకాల డౌట్లు. ఈ కథని ఎలా ముగించాలో గౌతమ్ మీనన్ ని అర్థం కాలేదనుకుంటా. చివర్నో ఆ చిన్న అసంతృప్తి మినహాయిస్తే… అంతా ఓకే.
దాదాపు నాలుగున్నర గంటల సుదీర్ఘ ప్రస్థానం ఈ ఆంథాలజీ. తొమ్మిది రసాల్లో కొన్ని ఆకట్టుకుంటాయి. కొన్ని అసంతృప్తికి గురి చేస్తాయి. ఇంకొన్ని.. విగిసిగస్తాయి. ఒకట్రెండు ఆశ్చర్యపరుస్తాయి. ఎలా చూసినా.. నవరసాల్లా.. ఇది కూడా మిక్స్డ్ ఫీలింగే.