నందమూరి బాలకృష్ణ ది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు.. ఎప్పుడు ఫైర్ అవుతాడో, ఎప్పుడు చెంప ఛెళ్లు మనిపిస్తాడో, ఎప్పుడు ప్రేమాభిమానాలు కురిపిస్తాడో చెప్పలేరు. కానీ.. ఆయనతో పనిచేసినవాళ్లంతా.. `బాలయ్య సూపరు…. `అంటూనే ఉంటారు. ఇప్పుడు నవీన్ చంద్ర కూడా అదే అంటున్నాడు. `బాలయ్య లాంటి హీరోని చూళ్లేదు. ఆయనతో పనిచేసిన రోజులు అద్భుతంగా గడిచాయి. ఆయన నాకు తెగ ముద్దొచ్చేశారు. ఓ ముద్దు కూడా పెట్టాలన్నంత ప్రేమ వచ్చింది…“ అని చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర.
బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో కీలకమైన పాత్ర పోషించాడు నవీన్ చంద్ర. ”సెట్లో బాలయ్య ఉగ్రరూపం చూశాను. ఆయన ఎనర్జీ గురించి మాటల్లేవు. బయట ఆయన గురించి చాలారకాలుగా మాట్లాడతారు.కానీ.. అవేం నిజం కాదు. నేను చూసిన బాలయ్య వేరు. ఈ సినిమాలో ఆయన విశ్వరూపం చూపించబోతున్నారు. ఆయన గెటప్, స్టైల్, డైలాగులూ నాకు బాగా నచ్చేశాయి…” అని సినిమాగురించి చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర. తన పాత్ర గురించి మాట్లాడుతూ ”ఈ కథలో నాలుగైదు పాత్రలు కీలకంగా ఉంటాయి. అందులో నా పాత్ర ఒకటి. నాది నెగిటీవ్ పాత్రనా, పాజిటీవ్ పాత్రనా అనేది ఇప్పుడే చెప్పను. కానీ… కచ్చితంగా కా కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర పడింది” అని ముచ్చటపడిపోయాడు నవీన్ చంద్ర. `విరాటపర్వం`లోనూ నవీన్ చంద్ర ఓ కీలక పాత్ర పోషించాడు. ఈనెలలోనే ఈ చిత్రం విడుదల కానుంది.