పెట్రోల్, డీజిల్ ధరలపై దేశంలో గగ్గోలు రేగుతోంది. అయితే దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా ఒరిస్సా ఎంతో భిన్నం. అక్కడ పాలకులు ముఖ్యంగా సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయాలను పాలనను అసలు కలపరు. అందుకే అక్కడ భిన్నమైన నిర్ణయాలు వస్తున్నాయి. కేంద్రం రూ. ఐదు, పది పెట్రోల్, డిజిల్‌పై తగ్గించగానే … రాష్ట్ర ప్రభుత్వం తరపున మరికొంత తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు. ఇలా చాలా రాష్ట్రాలు చేశాయి. అయితే నవీన్ పట్నాయక్ మరింత భిన్నంగా ఆలోచించారు. పెట్రోల్, డిజిల్ రేట్లు తగ్గినందున ఆర్టీసీ చార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం ఒరిస్సా ప్రజలనే కాదు..అందర్నీ అమితాశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలను. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డిజిల్‌పై పైసా తగ్గించబోమని అంతా కేంద్రమే చేసిందని రాష్ట్రాలు రాజకీయం చేస్తున్నాయి. ఆర్టీసీ చార్జీలు కూడా పెంచేందుకు దాన్నే కారణంగా చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నవీన్ పట్నాయక్ నిర్ణయం అందర్నీ ఆకర్షించకుడా ఎలా ఉంటుంది. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కేవలం వాటిని కొనుగోలు చేసే వారిపైనే ఉండదు.
రవాణాతో ముడిపడి ఉన్నందున నిత్యావసర వస్తువుల ధరలు సహా … సామాన్యుడి జీవనానికి అవసరమయ్యే అన్ని వస్తువులపైనా ఉంటుంది. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు సున్నితమైన విషయం. కానీ దురదృష్టవశాత్తూ అనేక రాష్ట్రాలు, కేంద్రం కూడా ఆదాయ కోణంలోనే చూసుకుంటున్నాయి…. ప్రజల్ని పిండేసుకుంటున్నాయి. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వంటి ముఖ్యమంత్రులు మాత్రం కాస్త ప్రజల గురించి ఆలోచిస్తున్నారు.