బాలీవుడ్ లో చాలా కాలం క్రితమే విక్కీ డోనర్ అనే సినిమా వచ్చింది. డబ్బుల కోసం స్మెర్మ్ డొనేట్ చేసే ఓ యువకుడి కథ. అసలు అలాంటి పాయింట్ ని జీర్ణంచేసుకోవడమే కష్టం. అలాంటిది.. తెరపై తీసుకొచ్చి హిట్ చేశారు. దాన్ని తెలుగులో రీమేక్ చేసి పాడు చేశారనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడు ఈ మేటర్ ఎందుకంటే.. తెలుగులోఇప్పుడు ఇలాంటి కథలు కొన్ని తయారవుతున్నాయి.
నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందే ఓ సినిమా.. స్పెర్మ్ డొనేషన్ నేపథ్యంలో తెరకెక్కబోతోందని సమాచారం. ఇప్పటికే కథ రెడీ అయిపోయింది. దానికి నవీన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మరోవైపు యూవీ క్రియేషన్స్ ఓ కథ సిద్ధం చేసింది. ఇది కూడా స్పెర్మ్ డొనేషన్ కథే. అంతే కాదు.. నాని దగ్గరకు ఓ కథ వచ్చింది. అది కూడా విక్కీ డోనర్కి అటూ ఇటుగా ఉంటుందట. అయితే నాని ఇంకా ఏ విషయం చెప్పలేదు. ఒకవేళ నాని వద్దనుకుంటే, ఈ కథ వేరే హీరోకి వెళ్లిపోవడం ఖాయం. మొత్తానికి ఒకే లైన్లో టాలీవుడ్ లో మూడు కథలు రెడీ అవుతున్నాయి. ఒకేసారి ఒకే తరహా కథలు పుట్టుకొచ్చాయంటే ఒక అనుమానం వెంటాడుతుంది. `ఇది ఏ హాలీవుడ్ సినిమాకి కాపీయో అని`. ఇప్పుడూ అంతేనా? లేదంటే మనవాళ్ల క్రియేటివిటీ స్మెర్ప్ డొనేషన్ వైపు మళ్లిందా? వేచి చూడాల్సిందే.