ఎవరు ఎప్పుడు స్టార్లు గా మారతారో చెప్పలేం. ఒక్క సినిమాతో అదృష్టం తిరగబడిపోతుంది. సినీలోకం బ్రహ్మరథం పడుతుంది. అలాంటి సినిమాలు వరుసగా రెండొచ్చాయి నవీన్ పొలిశెట్టికి. `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`తో తనదైన ముద్ర వేసేసిన నవీన్… `జాతిరత్నాలు`తో నయా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాలో నవీన్ కామెడీ టైమింగ్ స్టార్ హీరోల్ని సైతం మెప్పించింది. ఇప్పుడు టాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి నవీన్ పై పడిపోయింది.
నవీన్ చేతికి వస్తున్న ఆఫర్ల గురించి లెక్కేలేకుండా పోతోంది. వనీన్ ఎంత కోరితే అంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. హారిక హాసిని సంస్థ నవీన్ కి అడ్వాన్సు ఇచ్చినట్టు టాక్. దర్శకుడెవరో తేలకపోయినా ఈ సినిమా కోసం నవీన్‌కు 5 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు టాక్. అడ్వాన్స్ గా 2.5 కోట్లు, సినిమా పూర్తయ్యాక మరో 2.5 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందట. ఈ సినిమాకి ముందే యూవీలో పని చేయడానికి నవీన్ ఓకే అన్నాడు. అనుష్క కథానాయికగా నటిస్తోంది. `జాతిరత్నాలు`కంటే ముందే ఈ సినిమా ఓకే అన్నా.. ఇప్పటి రేంజ్ కి తగ్గట్టుగానే నవీన్‌కి పారితోషికం అందుతోందని తెలుస్తోంది.