ముగ్గురూ కామెడీ టైమింగ్ లో కింగ్‌లు. ముగ్గురూ కలిస్తే.. ఆ అల్లరి చెప్పేదేముంది? చూసి తరించాల్సిందే. నవ్వుల హరివిల్లులైపోవాల్సిందే. `జాతి రత్నాలు` ఆ అవకాశం కల్పించనుంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కథానాయకులుగా నటిస్తున్న సినిమా ఇది. స్వప్న దత్ నిర్మాత. అనుదీప్ దర్శకుడు. ఇప్పటికే `చిట్టీ… నా బుల్ బుల్ చిట్టీ` అనే పాట బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడో టీజర్ విడుదల చేశారు.
ఖైదీ నెంబర్ 201, 420, 840.. అంటూ ముగ్గురు హీరోల్నీ తీవ్ర వాదుల టైపులో చూపించారు. అయితే… ఇదంతా కామెడీ కోసమే అని ఆ తరవాత అర్థం అవుతుంది. `సర్పరోష్ కీ దిల్ మే తమన్నా, సమంత.. రష్మికా… ఓ తీనో మీరో సాత్ మే హై` అంటూ.. అర్థం పర్థం లేని ఓ డైలాగ్ తో… కామెడీ పుట్టించాడు.. ప్రియదర్శి.
`మన ముగ్గురిలో ఒకడు చచ్చిపోయినా ఫర్వాలేదు. మిగిలిన ఒక్కడు సంతోషంగా ఉంటే చాలు..`
అని అంతలోనే… `మీ ఇద్దరిలో ఆ ఒక్కడెవడో డిసైడ్ అవ్వండ్రా` అంటూ ఫైనల్ ఝలక్ ఇచ్చాడు. 5వేల కోట్ల చుట్టూ తిరిగే కథ ఇది. ఆ 5 వేల కోట్లు ఎవరికి దక్కాయో, అందుకోసం ఈ జాతి రత్నాలు ఏం చేశారో తెరపై చూడాలి. మొత్తానికి ఈ సినిమాలో వినోదానికి ఢోకా లేదని తేలిపోయింది. కాకపోతే… కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండేలా కనిపిస్తున్నాయి. మరి ఆ రెండింటికీ మిక్సింగ్ ఎలా కుదిరిందో తేలాలంటే జాతి రత్నాలు వచ్చే వరకూ ఆగాలి.