ఆమాద్మీ పార్టీలో చేరేందుకు భాజపాకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపి క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆమాద్మీ పార్టీకి కూడా పెద్ద షాక్ ఇచ్చారు. సిద్దూ స్వయంగా ‘ఆవాజ్ ఏ పంజాబ్’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. రాజకీయాలలో ఉన్న మాజీ హాకీ క్రీడాకారుడు పర్గాత్ సింగ్, సిమర్జీత్ సింగ్ బెయిన్, బల్వీందర్ సింగ్ బెయిన్ సోదరులు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దూ శుక్రవారం ప్రకటించారు.
తనని సాదరంగా ఆహ్వానించిన ఆమాద్మీ పార్టీకి సిద్ధూ కోలుకోలేని పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు. పంజాబ్ ఆమాద్మీ పార్టీ నుంచి ఇటీవల బహిష్కరింపబడిన సుచ్ సింగ్ చోటేపూర్ తో సహా పంజాబ్ లోని ఏడు జిల్లాల ఆమాద్మీ పార్టీ అధ్యక్షులని, ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలని వారి అనుచరులని కూడా తన కొత్త పార్టీలో చేర్చుకొబోతున్నారు. అంటే సిద్దూ పంజాబ్ లో ఆమాద్మీ పార్టీని ద్వంసం చేస్తున్నట్లే భావించవచ్చు. అదేవిధంగా అకాలీ దళ్ నుంచి బహిష్కృతులైన ఒకరిద్దరు నేతలని కూడా సిద్దూ స్థాపించబోతున్న కొత్త పార్టీలో చేరబోతున్నారు.
సిద్దూ ఆమాద్మీ పార్టీలో చేరకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అందరూ ఊహించారు కానీ ఈవిధంగా కొత్త పార్టీ స్థాపిస్తాడని ఎవరూ ఊహించలేదు. సిద్దూ కొట్టిన దెబ్బకి ఆమాద్మీ పార్టీ తేరుకోవడం చాలా కష్టమే. వచ్చే ఏడాది జరుగబోయే పంజాబ్ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీకి గెలిచే అవకాశాలు కనిపిస్తుండటంతో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గత ఏడాది కాలంగా పంజాబ్ లో చక్కర్లు కొడుతూ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సిద్దూ ఎంట్రీ ఇచ్చి ఆమాద్మీ పార్టీని చిదిమేస్తున్నాడు. సిద్దూ మా పార్టీలో చేరినా చేరకపోయినా అతని పట్ల నాకు ఎప్పుడూ గౌరవమే ఉంటుంది,’ అని 10 రోజుల క్రితం ట్వీట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు అతని గురించి ఏమని ట్వీట్ చేస్తారో చూడాలి. సిద్దూ ఎంట్రీతో పంజాబ్ లో ఓట్లు చీలిపోవడం ఖాయం. కనుక పార్టీల పొత్తులు అనివార్యం కావచ్చు.