ఇటీవల భాజపాకి, రాజ్యసభ సభ్యత్వానికి కుంటి సాకులతో రాజీనామా చేసిన క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఆగస్ట్ 15 నుంచి రాజకీయాలలో తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముహూర్తం పెట్టుకొన్నట్లు తెలుస్తోంది. ఆరోజు ఆయన ఆమాద్మీ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు తాజా సమాచారం. ఆమాద్మీ పార్టీ నుంచి అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన రాకపోయినా ఆ పార్టీ కన్వీనర్, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ “సిద్దూ చాలా మంచి వ్యక్తి..చాల సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారు” అని చేసిన చిన్న వ్యాఖ్య, సిద్ధూని స్వాగతిస్తున్నట్లుగానే భావించవచ్చు. ఆమాద్మీ పార్టీ నేతలు కూడా సిద్ధూ ఆగస్ట్ 15న తమ పార్టీలో చేరబోతున్నారని చెపుతున్నారు. అయితే భాజపాతో తనకున్న బలమైన బంధం త్రెంచేసుకొని, తను విమర్శించిన ఆమాద్మీ పార్టీలో సిద్దూ చేరడానికి ప్రధాన కారణం వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ శాసనసభ ఎన్నికలలో ఆయనకి ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బంపర్ ఆఫర్ ఇచ్చినందునేనని వార్తలు వచ్చాయి. వాటిని సిద్దూ కానీ ఆమాద్మీ పార్టీ గానీ ఇంతవరకు దృవీకరించలేదు.
సిద్దూ భాజపా నుంచి బయటకి వచ్చిన తరువాత ఆమాద్మీ పార్టీతో తెర వెనుక ఏమి మంతనాలు చేశారో తెలియదు కానీ ఆయనని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం లేదని, పార్టీ తరపున ప్రచార బాధ్యతలు ఆయనకి అప్పగించబోతున్నట్లు తాజా సమాచారం. ఒకవేళ అదే నిజమైనా పార్టీలో నేతలని కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన ఆయనకి ఆ బాధ్యతలు అప్పగించడం అంటే దానర్ధం అదే. కేవలం ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఆయనని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఇంకా ప్రకటించడం లేదని భావించవచ్చు.
ఒకవేళ అటువంటి ‘బంపర్ ఆఫర్’ లేనట్లయితే, కుంటి సాకులు చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాని, తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని నానా ఇబ్బందులు పడుతున్న ఆమాద్మీ పార్టీలో చేరవలసిన అవసరం సిద్ధూకి లేదు. కాంగ్రెస్ పార్టీ, భాజపాలు పంజాబ్ ఎన్నికలకి తమ ముఖ్యమంత్రి అభ్యర్ధుల పేర్లని ఇంకా ప్రకటించలేదు. కనుకనే సిద్దూ పేరుని ఇప్పుడే ప్రకటించడం తొందరపాటు అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆమాద్మీ పార్టీ కూడా ప్రకటించడం లేదేమో. అయినా సిద్దూ ఇంకా ఆమాద్మీ పార్టీలో ఇంతవరకు చేరనప్పుడు, ఆయనని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించలేదు కదా? ఆగస్ట్ 15న సిద్దూ ఆమాద్మీ పార్టీలో చేరిన తరువాత, ఈ విషయమపై పూర్తి స్పష్టత రావచ్చు.