విశాఖలో ఉన్న భారత నౌకాదళ స్థావరాలపై పాకిస్తాన్ గురి పెట్టింది. నౌకాదళంలో ఉన్న బలహీనులపై గురి పెట్టి.. హనీట్రాప్‌కు పాల్పడి.. కీలక సమాచారాన్ని సేకరించింది. అందమైన అమ్మాయిల పేరుతో సోషల్ మీడియాలో నౌకాదళ సిబ్బందిని ట్రాప్ చేసి.. సమాచారాన్ని మొత్తం సేకరించారు. ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. ఇలా మొత్తం ఏడుగురు దేశ రహస్యాలను హనీట్రాప్‌లో పడి.. పొరుగుదేశానికి అందించారు. వీరెవరెవరు.. అన్నతి తెలియదు కానీ.. విశాఖ రహస్యాలను మాత్రం.. తరలించారని స్పష్టమయింది. “ఆపరేషన్ డాల్ఫిన్ నోస్” పేరుతో సాగించిన ఆపరేషన్‌లో వ్యవహరం మొత్తం బట్టబయలైంది.
కేవలం.. అమ్మాయిల తీపి మాటలకే కాదు.. డబ్బులకు కూడా. .సమాచారాన్ని అమ్ముకున్నారు నౌకాదళ అధికారులు. మొత్తంగా హనీట్రాప్‌లో పడి దేశద్రోహానికి పాల్పడిన వారిలో ఇద్దర్ని ముంబై పోర్టు నుంచి.. కార్వార్ పోర్టు నుంచి ఇద్దర్ని.. విశాఖ పోర్టులో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. ఈ హనీట్రాప్‌ను కేంద్ర నిఘా వర్గాలు, నేవీ ఇంటెలిజెన్స్, ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా పసిగట్టాయి. అనుమానితులైన అధికారులతో పాటు ముంబైకి చెందిన దళారిని కూడా అదుపులోకి తీసుకున్నాయి. దేశద్రోహం కేసులో వారిని శుక్రవారం విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టారు.
దేశభద్రతకు విశాఖ.. వ్యూహాత్మక కేంద్రం. ఎయిర్ పోర్టు కూడా.. ఎయిర్‌ఫోర్స్ అధీనంలోనే ఉంటుంది. విశాఖకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంబిల్లి వద్ద ప్రత్యామ్నాయ స్థావరం ఏర్పాటుచేస్తున్నారు. మొదటి దశలో ఇప్పటికే 3 వేల ఎకరాల్లో జలాంతర్గామి స్థావరం నిర్మించారు. రెండో దశ పనులకు మరో 3,500 ఎకరాల భూమి సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ పాకిస్థాన్‌కు… నౌకాదళంలోని వారు చేరవేశారు.