యుద్ధ నౌకకు “పరిపాలనా రాజధాని విశాఖపట్నం ” అని పేరు పెట్టారన్న అంశం నిన్నటి నుంచి గందరగోళానికి కారణం అవుతోంది. సాధారణం యుద్ధ నౌకలకు శౌర్యవంతమైన పేర్లు లేకపోతే ఊళ్ల పేర్లు పెడతారు. ఉదారణకు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ధ్రువ్, ఐఎన్ఎస్ విశాఖపట్నం ఇలాంటి పేర్లతో ఉంటాయి. అయితే కొత్తగా వివాదానికి నేవీ తెర తీసింది. ముంబైలో రెడీ అవుతున్న ఓ యుద్ధ నౌకను విశాఖ తీరం కేంద్రంగా ఉపయోగిస్తారు. అందుకే ఈ నౌకకు పేరు ” ఐఎన్ఎస్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం ” అని పెట్టారట. నేవీ అధికారులు జారీ చేసిన ప్రకటనలో ఇలాగే ఉంది.
ఏపీ ప్రభుత్వం కూడా ఇలాగే చెప్పింది. దీంతో ఏపీ ప్రజలే కాదు రక్షణ రంగ నిపుణులు కూడా ఆశ్చర్యపోయారు. రేపు.. కొన్నింటికి దేశ రాజధాని ఢిల్లీ, బీహార్ రాజధాని పాట్నా, తమిళనాడు రాజధాని చెన్నై, కర్ణాటక రాజధాని బెంగళూరు అని కూడా పేర్లు పెడతారా అన్నప్రశ్నలు వస్తున్నాయి. పెట్టాలనుకుంటే విశాఖపట్నం అనే పేరు ఉండాలి పరిపాలనా రాజధాని అనే హోదాను యాడ్ చేయడం ఏమిటో చాలామందికి అర్థం కాలేదు. నేవీని కూడా ఏపీలో జరుగుతున్న రాజధాని వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేశారన్న అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం పైన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసారు.
ముంబయిలో నిర్మిస్తున్న యుద్ధ నౌకకు ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరునే కొనసాగించాలని ఆయన తన లేఖలో కోరారు.ఈ వివాదం రేగడానికి ప్రధాన కారణం సివిల్ మిలటరీ లైజన్ అధికారిగా ఉన్న కమాండర్ సుజిత్‌రెడ్డి అని ఆయనపై విచారణ చేపట్టాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా నౌకాదళం ప్రతిష్ఠను దెబ్బతీసే వారి నుంచి యూనిట్‌ను రక్షించాలని… సదరు అధికారి తన విధులకు కట్టుబడి ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి నేవీని తీసుకొచ్చిన వైనం ఏ మలుపులు తిరుగుతుందో అన్న ఆసక్తి ఏర్పడుతోంది.