మణిరత్నం స్టైలే వేరు. సినిమా తీయడంలో, క్యారెక్టర్లు డిజైన్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. తీస్తే… క్లాసిక్, లేదంటే అట్టర్ ఫ్లాప్.. ఇదీ ఆయన రేంజ్. ‘ఓకే బంగారం’లో ఫామ్ లోకి వచ్చినట్టే వచ్చి, మళ్లీ అంతలోనే జారిపోయారు. ఇప్పుడు ఆయన్నుంచి మరో సినిమా వస్తోంది. అదే `నవాబ్`. సంతోష్ శివన్, శ్రీకర్ ప్రసాద్, అరవింద్ స్వామి.. ఇలా తన టీమ్‌నే మళ్లీ నమ్ముకుని మణిరత్నం చేసిన మరో ప్రయత్నమిది. భూపతిరెడ్డి (ప్రకాష్‌రాజ్) ఓ డాన్. తనకు ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు అరవింద్ స్వామి. రెండో కొడుకు భూపతి రెడ్డి సీటుపై కన్నేస్తాడు. ‘నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా? అయితే వాడ్ని నమ్మకు’ అనే అరవింద్ స్వామి చెప్పే డైలాగ్‌కీ, ఈ కథకీ అంతర్లీనంగా లింకు ఉన్నట్టు కనిపిస్తోంది. స్నేహం ముసుగులో నమ్మక ద్రోహానికి ఒడిగడితే ఎలా ఉంటుందన్నది ఈ సినిమా కాన్సెప్ట్ కావొచ్చు. అరవింద్‌స్వామి, శింభు, భూమిక, విజయ్ సేతుపతి, ప్రకాష్‌రాజ్.. ఇలా ఈ సినిమాలో స్టార్లకు కొదవ లేదు. పొలిటికల్ డ్రామా, సస్పెన్స్, రొమాన్స్… ఇవి కూడా పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంతకు మించి.. ఇది మణిరత్నం సినిమా. నవాబ్ చూడ్డానికి ఇంకేం కావాలి? కాకపోతే.. మణిరత్నం ఫామ్ ఒకటే ఇబ్బంది పెడుతోంది. దానికి తోడు డబ్బింగ్ క్వాలిటీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరం. మరి ఈ ఒడిదుడుకుల్ని ‘నవాబ్’ ఎలా అధిగమిస్తాడో చూడాలి.