నవాజుద్దీన్ సిద్దీఖీ… గొప్ప నటుడు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అండర్ ప్లే చేయడంలో దిట్ట.. ఎలాంటి పాత్రలో అయినా ఇమిడిపోగలడు. అలాంటి నటుడు `సైంధవ్`లో తేలిపోయాడు. నవాజుద్దీన్ లాంటి ఓ నటుడు తెలుగులో తొలిసారి నటిస్తున్నాడంటే… కచ్చితంగా అందరి దృష్టి అటు వైపు వెళ్తుంది. నవాజుద్దీన్ మాత్రమే చేయగలిగే పాత్ర ఏమిటా? అని ఆసక్తి కనబరుస్తారు. కానీ… ‘సైంధవ్’ కోసం ఆయన చేసిందేం లేదు. ఇలాంటి పాత్ర కోసమా ఆయన్ని బాలీవుడ్ నుంచి తీసుకొచ్చింది అనిపించింది.
ఈ పాత్ర కోసం నవాజుద్దీన్కి అక్షరాలా.. రూ.8 కోట్ల పారితోషికం ఇచ్చారని టాక్. నిజానికి సౌత్ సినిమాల్లో నటించడం నవాజుద్దీన్కి సుతారమూ ఇష్టం లేదట. భాష రాకపోవడమే ప్రధానమైన కారణం. సంభాషణలు అర్థం చేసుకోలేకపోతే, పాత్రలో లీనం అవ్వడం కష్టమన్నది నవాజుద్దీన్ ఉద్దేశం. అలాంటి నవాజుద్దీన్ని బతిమాలి మరీ… ఈ సినిమా కోసం ఒప్పించారు. రూ.8 కోట్లు ముట్టజెప్పారు. ఈమాత్రం క్యారెక్టర్ చేయడానికి తెలుగులో ఎంతమంది విలన్లు లేరు..? తెలుగు విలన్లకు, తెలుగు నటులకు పారితోషికం ఇచ్చేటప్పుడు సవాలక్ష విధాలుగా ఆలోచించి, గీచి గీచి మరీ బేరాలాడే నిర్మాతలు.. బాలీవుడ్ నటులకు మాత్రం కోట్లు గుమ్మరిస్తారు. ఇదేం విచిత్రమో..? అందుకే అంటారు మరి.. పొరుగింటి పుల్లకూరకు రుచెక్కువ అని.