నవాజుద్దీన్ సిద్ధిఖీ… ఇప్పటివరకూ తెలుగు ఒక్క సినిమా చేయలేదు. కానీ ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదీ ఆయన పాపులారిటీ. ఏ పాత్ర ఇచ్చినా అందులోకి పరకాయప్రవేశం చేయడం ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు వెంకటేష్ సైంధవ్ తో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఈ సందర్భంగా ఆయనతో చిట్ చాట్..
* తెలుగులో సినిమా చేయడం బాగా లేట్ అయ్యిందేమో ?
నిజమే. కానీ ప్రతి నటుడు మంచి కథ కోసం ఎదురుచూస్తాడు. నేనూ అలానే చూశాను. ఇప్పుడు సైంధవ్ కుదిరింది.
* ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?
యూనిక్ క్యారెక్టర్. దర్శకుడు శైలేష్ చాలా బాగా డిజైన్ చేశాడు. అవసరం వున్న ప్రతి చోటా మెరుగుపరిచాడు. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది.
* వెంకటేష్ గారి నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ?
ఆయన చాలా క్రమశిక్షణ గల నటుడు. ముఖ్యంగా ఆయనకి సహనం ఎక్కువ. అది తప్పకుండా నేర్చుకోవాలి.
* తొలి సినిమాకే తెలుగు డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది ?
కొత్త భాష నేర్చుకోవడం కష్టం. అయితే నా నటనకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం కూడా నాకు బొత్తిగా ఇష్టం లేదు. పైగా ఇందులో నేను హైదరాబాది. కొంచెం హిందీ, కొంచెం తెలుగు మిక్సింగ్ వుంటుంది. దీనికి నేను డబ్బింగ్ చెప్పడం కరెక్ట్ అనిపించింది. కొన్ని పదాలు కష్టమైనా నేర్చుకొని చెప్పా. ఈ విషయంలో దర్శకుడు చాలా ప్రేరణ ఇచ్చాడు.
* కెరీర్ తొలినాళ్ళలో చాలా కష్టాలు చూశారు కదా ?
దానిని కష్టం అనుకోను. ఇది ప్రతి రంగంలోనూ వుంటుంది. పక్కవాళ్లు మనల్ని గుర్తించాలంటే మనలో వున్న ప్రత్యేకత ఏమిటో వాళ్లకి తెలియాలి. అలా తెలియజేయడానికి సరైన అవకాశం రావాలి. ఆలాంటి అవకాశం కోసం చాలా కాలం ఎదురుచూశాననే అనుకుంటాను.
* బాలీవుడ్ కి టాలీవుడ్ కి తేడా ఏమిటి ?
ఇక్కడ పనులన్నీ చాలా పద్దతిగా జరుగుతున్నాయి. టైమ్ సెన్స్ కూడా బావుంది. చెప్పిన టైమ్ కి షూటింగ్ మొదలెడతారు. చెప్పిన సమయానికి పూర్తి చేస్తారు.
* సైంధవ్ లో మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉందా
సముద్రంలోని ఓ బోట్లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాం. బోట్ పై స్పీడ్ గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దీంతో ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి వెళ్ళిపోయాను.. లక్కీగా.. సేఫ్ గా ల్యాండ్ అయ్యాను. ఆ సీన్ సినిమాలో వుంటుంది.
* మీ కెరీర్లో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో చేశారు. ఇంకా చేయాలనుకునే పాత్రలు ఏమైనా ఉన్నాయా ?
ఓషో బయోపిక్ చేయాలని వుంది.
* మీ కెరీర్ పట్ల ఆనందంగా వున్నారా ?
చాలా ఆనందంగా వున్నాను. నేను కోరుకున్నదాని కంటే ఎక్కువే దొరికింది.
* ఆల్ ది బెస్ట్
థాంక్ యూ