Nayaki Movie Review, Nayaki telugu movie review, nayaki review, trisha nayaki telugu movie review, nayaki rating, Nayagi Movie Review
హారర్ కామెడీ ట్రెండ్‌పై మన వాళ్లకింకా మోజు తగ్గలేదు. ఈ జోనర్లో పుష్కరానికో హిట్టొస్తుంది. అది చూసి… మరో పాతిక సినిమాలు రెడీ అయిపోతాయి. హారర్ కామెడీ కథలన్నీ ఓకే `గిరి` గీసుకొని తిరుగుతుంటాయి. ఓ ఇంట్లో కామెడీ గ్యాంగ్ ప్రవేశించడం… అక్కడ ఓ దెయ్యం ఉండడం.. ఆ దెయ్యానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండడం.. ఇదే తంతు! సరిగ్గా ఇదే కొలతలతో తయారైన మరో హారర్ కామెడీ.. నాయకి. ఇన్నేళ్ల కెరీర్లో తొలిసారి త్రిష నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమా చేయడం వల్లో, పోస్టర్లపై త్రిష డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకోవడం వల్లో ఈ సినిమాపై కాస్త ఫోకస్ పడింది. మరి.. నాయకి సినిమా దానికి తగ్గట్టుగానే ఉందా?? లేదంటే… రొటీన్‌గా విసిగించిందా?? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
దుండగల్లో వరుసగా వ్యక్తులు అపహరణకు గురవుతుంటారు. అక్కడకు వెళ్లిన వాళ్లెవ్వరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేకపోవడంతో ప్రభుత్వం దుండగల్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటిస్తుంది. దుండగల్లోకి ఓ కోటలో ఆత్మ రూపంలో తిరుగుతుంటుంది గాయత్రి (త్రిష). సంజయ్ ( సత్యం రాజేష్) అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తన గాళ్ ఫ్రెండ్‌తో సహా ఆ కోటలోకి అడుగుపెడతాడు. సెల్‌ఫోల్ కెమెరాలో మాత్రమే కనిపిస్తూ గాయత్రి సంజయ్‌ని బాగా భయపెడుతుంది. ఆ కోట నుంచి తప్పించుకొనే మార్గమే ఉండదు. ఈలోగా ఇంకొన్ని ఆత్మలు ఆ కోటలో కనిపిస్తాయి. వారంతా.. దుండగల్ లో కనిపించకుండా పోయినవాళ్లే. ఇంతకీ గాయత్రి ఎవరు? సంజయ్ ఆ కోటలోకి ఎందుకు వెళ్లాల్సివచ్చింది. యుగంధర్ (గణేష్ వెంకట్రామన్)కీ గాయత్రీకి ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ… నాయకి చూసి తెలుసుకోవాల్సిందే.
* నటీనటుల ప్రతిభ
త్రిష నాయిక ప్రాధాన్యత ఉన్న కథని ఎంచుకోవడం ఇదే తొలిసారి. ఆమె పాత్ర రెండు విభిన్న కోణాల్లో సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్‌లో కథానాయిక కావాలని తాపత్రయ పడే ఓ సగటు అమ్మాయిలా… ప్రధమార్థంలో ఆత్మలా రెండు పాత్రల్లోనూ వైవిధ్యం చూపించింది. వయసు పెరుగుతున్న ప్రభావం త్రిషలో అస్సలు కనిపించడం లేదు. టైటిల్ కార్డులో వేసినట్టు.. తాను ఎవర్ గ్రీనే అనిపించుకొంది. అయితే… ఆమె పెర్ఫార్మ్సెన్స్కి స్కోప్ లేకుండా పోయింది. త్రిష డబ్బింగ్ కుదర్లేదు. ఆమెతో ఓ పాట పాడించారు. కానీ అది తీసుకెళ్లి ఎండ్ కార్డ్స్‌లో పడేశారు. సత్యం రాజేష్నటన ఆకట్టుకొంటుంది. ఒక విధంగా ఈ సినిమాలో తనే హీరో. కండలు పెంచి.. కొత్తగా కనిపించాడు. ఫస్టాఫ్ కాస్త చూడగలిగామంటే దానికి కారణం.. రాజేషే. గణేష్ వెంకట్రామన్ సెకండాఫ్‌లో కనిపించాడు. అతని పాత్ర నెగిటీవ్ షేడ్‌లో సాగుతుందన్న విషయం… తాను కనిపించిన ఫస్ట్ సీన్లోనే తెలిసిపోతుంది. దాంతో.. ఆ క్యారెక్టర్లో ఉన్న సస్పెన్స్ ముందే తేలిపోతుంది. బ్రహ్మానందం మరోసారి వేస్ట్ క్యారెక్టర్లో కనిపించాడు. మిగిలినవాళ్లంతా ఓకే.
* సాంకేతిక వర్గం
గోవి రాసుకొన్న కథలో కొత్తదనం లేదు. స్క్రీన్ ప్లేలో మెరుపుల్లేవు. హారర్ కామెడీ జోనర్లో గతంలో వచ్చిన సినిమాల్ని మళ్లీ ఓసారి తెరపై చూసినట్టు ఉంటుంది. కొన్ని డైలాగులు బాగానే పేలాయి. సత్యం రాజేష్ కోసం రాసుకొన్న డైలాగులు ఆకట్టుకొంటాయి. సంగీతం అందించే బాధ్యతని రఘు కుంచె, సాయికార్తీక్ అందించారు. ఆర్ .ఆర్ ఓకే అనిపించినా… పాటలు ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌లో వచ్చే పాట… అనవసరం. చిన్న సినిమా అయినా మేకింగ్ క్వాలిటీ బాగుంది.
* విశ్లేషణ
తొలి సన్నివేశాల్ని ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ఆ కోటలో ఏదో జరుగుతోందన్న ఉత్సుకత కలిగించాడు. దారి తప్పిన సత్యం రాజేష్.. త్రిష ఉన్న కోటలోకి ఎంటర్ అయ్యే సన్నివేశాలూ రక్తికట్టించాయి. కోటలో ఓ పదినిమిషాల కామెడీ ఎపిసోడ్… నవ్వులు పంచుతుంది. కానీ ఆ తరవాత నుంచి అంతా మామూలే. సినిమాలో సీరియస్‌నెస్ పోతుంది. అలాగని కామెడీ కూడా లేదు. ప్రేమకథా చిత్రమ్ లాంటి సినిమాల్లో దెయ్యం చేతులో చావు దెబ్బలు తిన్న కమెడియన్ చేసే విన్యాసాలే ఇందులోనూ కనిపిస్తాయి. ద్వితీయార్థం మొత్తం కామెడీ మిస్సయ్యింది. ఫ్లాష్ బ్యాక్‌లో ఏదో ఉంటుందనుకొంటే అదీ తుస్సుమంది. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యిందో.. క్లయిమాక్స్ ఎలా సాగుతుందో ఈజీగానే ఊహిస్తాడు ప్రేక్షకుడు. సినిమా అయిపోయాక కూడా దెయ్యంతో సినిమా తీసి ఓ పదినిమిషాలు సాగదీశారు. ఇటీవల హిట్టయిన ఓ పది హారర్ కామెడీ సినిమాల్ని వరుస పెట్టి చూస్తే… వాటికి నాయకి ఓ నకిలీలా కనిపిస్తుంది.
* తెలుగు 360.కామ్ రేటింగ్ : 1.5/5