దక్షిణాదిన లేడీ ఓరియెంటెడ్ కథలకు పేటెంట్ హక్కులు ఇచ్చేసుకుంది నయనతార. తెరపై నయన కనిపిస్తుందంటే… టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ కట్టేవాళ్లున్నారు. కాబట్టి వ్యాపార పరంగా నయనని ఎంచుకుంటే ఎలాంటి ఢోకా ఉండదు. కాబట్టి నిర్మాతలు సేఫ్. అందుకే నయన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పుంకానుపుంకాలుగా వస్తున్నాయి. ఈరోజు విడుదలైన ‘గేమ్ ఓవర్’ కథ కూడా నయనదే. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా చేయాలని భావించారు. నయన పారితోషికం మినహాయించి 7 కోట్లలో ఈ సినిమా పూర్తి చేయాలని అనుకున్నారు. ఒకట్రెండు రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ.. కథ విషయంలో కాస్త పేచీ వచ్చింది. ఈ లైన్ ఓ హాలీవుడ్ సినిమా నుంచి తీసుకున్నారు. ఆ కథ తాలుకూ రచయితకీ, చిత్రబృందానికీ పేచీ వచ్చింది. దాంతో సినిమా ఆగిపోయింది. ఆ కథే తాప్సి దగ్గరకు వెళ్లింది. అయితే.. కథలో కొన్ని కీలక మార్పులు (టాటూ ఎపిసోడ్)లాంటివి వచ్చి చేరాయి. మొత్తానికి నయన నుంచి అనుకోకుండా ఓ కథ జారిపోతే, దాన్ని తాప్సి ఒడిసిపట్టుకుంది. లేదంటే ఈ ‘గేమ్’ మరోలా ఉండేదేమో..?!