హైదరాబాద్: పండిట్ నెహ్రూ మేనకోడలు, ప్రముఖ రచయిత్రి నయనతార సెహగల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిపై ప్రశంసలు గుప్పించారు. ఇవాళ చండీగఢ్‌లో ఒక సాహిత్య కార్యక్రమంలో మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాలక్రితంవరకు రాహుల్‌ను గురించి అందరిలాంటి అభిప్రాయమే తనకూ ఉండేదని, అతను రాజకీయాలకు సరిపోడని, వేరే వృత్తి ఏదైనా చూసుకోవాల్సిందని భావించానని చెప్పారు. బీహార్ ఎన్నికలలో ఇటీవల అతను ప్రసంగిస్తుంటే చూశానని, చాలా చక్కగా మాట్లాడాడని అన్నారు. గణాంకాలు, వాస్తవాలుకూడా బాగా చెబుతున్నాడని చెప్పారు. అతను తన సత్తా నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు కనబడుతోందని అన్నారు. గతంలో అతను కేవలం తెరవెనక పాత్రనే పోషించేవాడని, యూత్ కాంగ్రెస్ వ్యవహారాలను మాత్రమే చూసేవాడని చెప్పారు. అయితే ఇప్పుడు మరింత పెద్ద పాత్ర పోషించాలని డిసైడయినట్లు కనిపిస్తున్నాడని అన్నారు. ఖచ్చితంగా అతనిలో గొప్ప మార్పులు కనిపిస్తున్నాయని, ఆ మార్పులన్నీ మంచివేనని వ్యాఖ్యానించారు. నయనతార సెహగల్ ఇటీవల దాద్రి ఘటనకు నిరసనగా సాహిత్య అకాడమీ అవార్డ్ వెనక్కు ఇచ్చి వార్తల్లోకొచ్చిన సంగతి తెలిసిందే. తాను నెహ్రూ, గాంధిల జీవితాలతో తీవ్రంగా ప్రభావితం అయ్యానని నయనతార చెప్పారు. తనకు రాజకీయాలు ఇష్టంలేదని, రెండుసార్లు ఎంపీ అవకాశాలు వచ్చినా తీసుకోలేదని అన్నారు. అధికారం, సంపద అనే రెండింటినీ తాను ఎప్పుడూ కోరుకోలేదని నయనతార చెప్పారు. రాజకీయాలను తన రచనా వ్యాసాంగానికి మాత్రమే వాడుకున్నానని అన్నారు.