నయనతార.. ఒకప్పుడు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన కథానాయిక. ఇప్పుడు కూడా నయన తార సినిమా అంటే… టాలీవుడ్ మొత్తం ఇంట్రస్ట్ చూపిస్తుంటుంది. కానీ తాను మాత్రం తమిళం వైపు మొగ్గు చూపించింది. తెలుగులో బోల్డన్ని హిట్లు కొట్టినా, ఇక్కడ కూడా కోట్లు దండుకొన్నా… తన ప్రేమంతా తమిళ చిత్ర రంగానికే పంచి పెట్టింది. కనీసం `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లో కూడా ఇప్పటి వరకూ సభ్యత్వం తీసుకోలేదు నయన. అంటే టాలీవుడ్ అంటే ఆమెకు ఎంత చిన్న చూపో అర్థం చేసుకోవొచ్చు. ఈమధ్య చాలా సినిమాలన్ని నిర్దంద్వంగా తిరస్కరించింది. అందులో బాలయ్య, చిరు సినిమాలు కూడా ఉన్నాయి. వెంకటేష్ సినిమా `బాబు బంగారం` సినిమాని పూర్తి చేయడానికి నయన పెట్టిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా బి.గోపాల్ – గోపీచంద్ సినిమా కూడా నయన కాల్షీట్లు ఇవ్వకపోవడం వల్లే ఇరకాటంలో పడింది. దాంతో తెలుగు చిత్రసీమ నయనపై యాక్షన్ తీసుకోవడానికి రంగంలోకి దిగింది. ఇక మీదట నయనని తెలుగు సినిమాల్లో తీసుకోకూడదన్నట్టు ఓ అప్రకటిత సస్పెన్షన్ని విధించింది. ఈ విషయం నయనకీ తెలిసిపోయిందేమో ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తున్నట్టు టాక్.
తెలుగులో మళ్లీ అవకాశాలు సంపాదించుకోవడానికి నయన స్కెచ్చులు వేస్తోందని, ఇటీవల తనకు బా……..గా దగ్గరైన ఓ దర్శకుడ్ని నయన ఫోన్లో సంప్రదించిందని, తెలుగులో మళ్లీ ఓ భారీ కమర్షియల్ సినిమా చేయాలన్న కోరికను వ్యక్త పరిచిందని, ఆ దర్శకుడు కూడా నయనని మళ్లీ సరికొత్తగా రంగంలోకి దింపడానికి స్కెచ్చులు వేస్తున్నాడని టాక్. తెలుగులో సీనియర్ కథానాయికలంతా రీ ఎంట్రీ కోసం ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు నయన కూడా చేరిందన్నమాట. కాకపోతే.. నిర్మాతలేమంటారో?? నయనని తీసుకొంటే నిర్మాతల మండలి నుంచి అభ్యంతరాలేమైనా వస్తాయేమో అన్న డౌట్లు వ్యక్తం అవుతున్నాయి. నయన ప్రయాణం సాఫీగా సాగాలంటే ముందు తన చేతిలో ఉన్న గోపీచంద్ సినిమాని ఎలాంటి ఆటంకాలూ కల్పించకుండా పూర్తి చేయాలి. మరి నయన కనికరిస్తుందా, నిర్మాతల కనికరం పొందుతుందా? వేచి చూడాల్సిందే.