తెలంగాణ క్యాబినెట్ లో మార్పులు ఉండబోతున్నట్టుగా కొన్నాళ్ల కిందట బలంగా వినిపించింది. కానీ, తరువాత ఆ చర్చ పక్కకు వెళ్లింది. ఇప్పుడు మరోసారి ఆ చర్చ రాజకీయవర్గంలో కాస్త బలంగానే వినిపిస్తూ ఉండటం విశేషం! తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డిని మార్చే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వయోభారంతో తన శాఖ బాధత్యలను ఆయన సరిగా నిర్వహించలేకపోతున్నారనీ, అందుకే ఈ మార్పు ఉండొచ్చనే ప్రచారం తెరాస వర్గాల్లో జరుగుతోంది. అయితే, నాయని కీలకమైన శాఖ నుంచి తప్పించడం ద్వారా మరో కీలక నేతకు ప్రాధాన్యత కల్పించడం, తద్వారా పార్టీకి మేలు జరిగేలా చూసుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఆ కీలకనేత మరెవ్వరో కాదు… కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. గడచిన ఎన్నికల్లో ఆయన నల్గొండ నుంచి కాంగ్రెస్ టిక్కెట్ పై పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే, కొన్నాళ్ల కిందట తెరాసలో చేరిపోయారు. కానీ, సాంకేతికంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ రాకుండా, విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా అధికారికంగా తెరాసలో చేరినట్టు గులాబీ కండువా ఆయన కప్పించుకోలేదు. ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతోనే తెరాసలో చేరినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, గుత్తా ఆశించినట్టుగా ఇంతవరకూ ఏదీ జరగలేదు! మంత్రి పదవి వస్తుందని అనుకున్నా.. అలాంటి అవకాశమే ఇంతవరకూ రాలేదు. దీంతో తెరాసపై గుత్తా కొంత అసహనంతో ఉన్నారనే కథనాలు కూడా ఈ మధ్య వినిపించాయి. రైతు సమన్వయ కమిటీ బాధ్యతల్ని ఆయనకి అప్పగించి, క్యాబినెట్ హోదా కల్పించడం ద్వారా గుత్తాను సంతృప్తిపరుస్తారనీ అనుకున్నారు. కానీ, పదవి కూడా ఇంతవరకూ గుత్తాకు దక్కలేదు.
అందుకే, ఇప్పుడు నాయని నర్సింహా రెడ్డిని రాజ్యసభకు పంపించి.. ఆ స్థానంలో గుత్తాకు కీలక శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ఊహాగానాలు వారం రోజులుగా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గుత్తాకి ఈ శాఖ ఇవ్వడం ద్వారా తెరాస ఆశిస్తున్న మరో రాజకీయ ప్రయోజనం కూడా ఉన్నట్టు సమాచారం! నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మాంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉన్నవారు ఆ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో తెరాసకు ఆశించిన స్థాయిలో ఈ జిల్లాపై పట్టు దొరకడం లేదు. గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా.. ఆయన మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తారనీ, ఆయన పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీ కాబట్టి… నల్గొండ జిల్లాలో కేడర్ ను చీల్చగలరనే వ్యూహంతో ఉన్నారట. సొంత జిల్లాలో తెరాస బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తారనే వ్యూహంతోనే ఈ మార్పునకు కేసీఆర్ సిద్ధపడుతున్నట్టు కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తనను పక్కనపెడుతున్నారనే భావన నాయనికీ కలుగకుండా ఉండేందుకు రాజ్యసభకు పంపించాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.