రూ. 25 కోట్ల విలువల గల బ్రౌన్ షుగర్ మాయమైంది. దాని కోసం ఓ ముఠా తిరుగుతోంది. దాన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత ఓ అమ్మాయిపై పడింది. ఎందుకంటే.. స్మగ్లర్మ చేతిలో తన కుటుంబం మొత్తం బంధీగా ఉంది. మరి ఆ అమ్మాయి ఏం చేసింది? బ్రౌన్ షుగర్‌ని తీసుకొచ్చి, తన కుటుంబాన్ని కాపాడుకుందా, లేదంటే ఆ ముఠాని ఎదిరించిందా? – నయనతార కథానాయికగా నటిస్తున్న ‘కో కో కోకిల’ కథ ఇదే. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. లైకా సంస్థ నిర్మించిన చిత్రమిది. అనిరుథ్ సంగీతం అందించారు. చూస్తుంటే.. ఇదే క్రైమ్, కామెడీ, థ్రిల్లర్‌లా ఉంది. మరోసారి నయనతార ఓ సినిమా మొత్తాన్ని తన భుజ స్కంధాలపై వేసుకుని నడిపించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మాటలు తక్కువ, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ అన్నట్టు తీర్చిదిద్దారు కోకిల పాత్రని. మేకింగ్, ఆర్.ఆర్, విజువల్స్, సంభాషణలు చూస్తుంటే.. తప్పకుండా ఇదో మంచి థ్రిల్లర్ అవుతుందేమో అనిపిస్తోంది. ఆగస్టు 17న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.