ఓ కథానాయిక 75 సినిమాల మైలు రాయి అందుకొందంటే అది గొప్ప విషయమే. 50వ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోయేలా తీర్చిదిద్దాలని అనుకోవడంలోనూ ఎలాంటి తప్పూ లేదు. నయనతార 75 సినిమా మాత్రం ఆమెకు ఎప్పుడూ లేనన్ని చిక్కుల్లో పడేసింది. అదే ‘అన్నపూరణి’. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. బాక్సాఫీసు దగ్గర అంతంత మాత్రంగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు పలు విమర్శల్ని ఎదుర్కొంటోంది. ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, ఓ ముస్లింని పెళ్లి చేసుకొని, ఆ మతాచారాలను పాటిస్తుంది. చివరికి మాంసాహారం కూడా అలవాటు చేసుకొంటుంది. బిరియానీలు వండి పెడుతుంది. మాస్టర్ చెఫ్ కాంపిటీషన్లో విజయం సాధిస్తుంది. ఇదీ కథ. అమ్మాయిల్లో స్ఫూర్తి నింపాలన్న కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ తరహా కథ రాసుకొని ఉండొచ్చు. కానీ… ఈ సినిమా హిందువుల మనోభావాల్ని పూర్తిగా దెబ్బతీసింది. అందుకే ఇప్పుడు వాళ్లు గొంతెత్తుతున్నారు.
మత మార్పిడిలను ఈ సినిమా ప్రోత్సహించేలా ఉందని తమిళనాట తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నయన తారపై, దర్శక నిర్మాతలపై కేసులు కూడా నమోదవుతున్నాయి. తాజాగా ముంబై పోలీస్ స్టేషన్లోనూ ఓ కేసు నమోదయ్యింది. ఈ సినిమా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా `లవ్ జిహాది`ని ప్రోత్సహించేలా ఉందని, దర్శక నిర్మాతలతో పాటు నయనతారపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు నయనతారపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. తమిళనాట ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాని వెంటనే నిషేధించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.