హైదరాబాద్: తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం మకుటంలేని మహారాణి ఎవరు అంటే ముక్త కంఠంతో వెలువడుతున్న సమాధానం నయనతార. 80వ దశకంలో కుష్బూ, 90వ దశకంలో సిమ్రన్ తమిళ సినిమా ఇండస్ట్రీని ఏలినట్లు ఇప్పుడు నయనతార ఏలుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్లో విజయవంతంగా నడుస్తున్న మూడు చిత్రాలలో నయనతార ఉందంటే ఆమె సక్సెస్ రేషియో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూడు చిత్రాలలో మాయ(తెలుగులో ‘మయూరి’) హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కాగా, ‘తని ఒరువన్’లో జయం రవి పక్కన హీరోయిన్. ఇక ‘త్రిష ఇల్లన నయనతార’ చిత్రంలో ఆమె లేకపోయినా టైటిల్లో ఉండటంతోనే ఆ చిత్రానికి పెద్ద క్రేజ్ వచ్చింది… సూపర్ హిట్ కూడా అయింది. మాయ చిత్రం ఇప్పుడు కోలీవుడ్లో నంబర్ వన్ చిత్రంగా నిలిచింది.
పని విషయంలో పక్కా ప్రొఫెషనలిజం చూపించటం, సినిమా ఫంక్షన్లలో అరుదుగా హాజరవటం వంటి విలక్షణ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ వలన ఆమెను తమిళ ప్రేక్షకులు అంతగా అభిమానిస్తున్నారని చెబుతున్నారు. దానికితోడు సింబు, ప్రభుదేవాల చేతుల్లో మోసపోవటం ఆమెపై సానుభూతిని కలిగించి ఉండొచ్చుకూడా. ఒక సమయంలో ప్రభుదేవాను పెళ్ళిచేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానని ఆమె ప్రకటించారు. అయితే ప్రభుదేవాతో రిలేషన్ తెగిపోవటంతో మళ్ళీ సినిమాలు చేయటం ప్రారంభించారు. నయనతార ప్రస్తుతం ‘నానుమ్ రౌడీ దాన్’, ‘తిరునాళ్’, ‘కాష్మోరా’, ‘పుదియ నియమమ్’ చిత్రాలలో నటిస్తున్నారు.