చాలాకాలం క్రిందటే నయనతార రూటు మార్చేసింది. కేవలం పద్ధతైన పాత్రలనే ఎంచుకొంటోంది. రొమాన్స్, కమర్షియల్ అంశాలూ వీటిని పూర్తిగా పక్కన పెట్టేసింది. కమర్షియల్ సినిమాల్లో నటించినా.. తన పాత్ర మేరకు ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతుంది. ఈ మార్పు ఎందుకొచ్చింది?? అని నయనతారని అడిగితే.. ”నా కెరీర్లో కమర్షియల్ సినిమాలు చాలా చేశా. అలాంటి సినిమాల్లో చేసీ చేసీ బోర్ కొట్టేసింది. కథానాయిక అంటే పాటలూ, ముద్దులకు మాత్రమే అంటే నేను ఒప్పుకోను. అంతకు మించి ఏదో ఉండాలి. లేకపోతే కథానాయిక పాత్రల్ని ప్రేక్షకులు గుర్తించరు” అని చెప్పుకొచ్చింది నయన. అయితే.. ప్రతీసారీ లేడీ ఓరియెంటెడ్ పాత్రలే దక్కుతాయని గ్యారెంటీ లేదు. ఆ విషయం నయనకూ తెలుసు. ”లేడీ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తా అని చెప్పడం లేదు. అలాంటి అవకాశాలు ఎప్పుడోగానీ రావు. సినిమా అంతా నాచుట్టూ తిరగాలన్న రూలు లేదు. కానీ నా పాత్రకు గుర్తింపు ఉండాలనుకోవడం తప్పు కాదు..” అంటోంది.
కథానాయకుడితో పాటలు పాడడానికి, డాన్పులు చేయడానికి తాను వ్యతిరేకం కాదంటోంది నయన. అయితే వాటి కోసమే కథానాయిక పాత్రల్ని డిజైన్ చేస్తేమాత్రం అస్సలు ఒప్పుకోదట. ఈమధ్య కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కాదనుకొంది నయన. దానికి కారణం కేవలం తన పాత్రకు ప్రాధాన్యం లేకపోవడమే. ”స్టార్ చిత్రాలతో పోలిస్తే.. మీడియం బడ్జెట్ చిత్రాల్లో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉంటోంది. అవే నన్ను ఆకర్షిస్తున్నాయి..” అంటూ అసలు నిజాన్ని ఒప్పుకొంది నయన. సో.. కథానాయిక పాత్రకు నయన తారే కావాలనుకొంటే ఈ రూల్స్ అన్నీ పాటించాలన్నమాట.