శ్రియ ఈమధ్యే రహస్యంగా వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. శ్రియ పెళ్లి ఫొటోలు బయటకు వస్తే తప్ప.. ఆవిషయాన్ని ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు నయనతార కూడా అదే బాటలో రహస్యంగా పెళ్లి చేసుకోబోతోందన్నది చెన్నై సినీ వర్గాల టాక్. నయనతార ప్రముఖ తమిళ దర్శకుడు విజ్ఞేశ్ శివన్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఎన్నో ఫొటోలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇటీవల నయనతార ఓ అవార్డు ఫంక్షన్లో ‘నాకు కాబోయే భర్త’ అంటూ ఓ హింట్ ఇచ్చేసింది. అంటే నయన పెళ్లికి సిద్ధమైందన్నమాటే. ఆ కాబోయే భర్త పేరేంటో స్పష్టంగా చెప్పకపోయినా.. కచ్చితంగా అది విజ్ఞేశ్ గురించే అన్నది బహిరంగ రహస్యమే.
కాకపోతే ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నయన.. తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. నయన తార హడావుడీ ఆర్భాటలకు చాలా దూరం. మీడియానీ దగ్గర రానివ్వదు. తానూ వెళ్లదు. ఇప్పటికే ప్రేమ – పెళ్లి విషయాల్లో రెండుసార్లు మోసపోయింది. అందుకే… ఈసారి గుట్టు చప్పుడు కాకుండా… పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. రహస్యంగా పెళ్లి చేసుకుని, ఆ తరవాత ఫొటోల్ని మీడియాకు లీక్ చేయాలన్నది నయన ఆలోచన. మరి… ఆ పెళ్లి ముహూర్తం ఎప్పుడో..??