నయనతార పెళ్లి మేటర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. అప్పట్లో శింబు, ప్రభుదేవా, ఇప్పుడు విఘ్నేష్ శివన్ వరకూ నయనతో ముడిపెట్టి రకరకాల వార్తలు వండేశారు. అయితే విఘ్నేష్ శివన్‌తో బంధం రోజు రోజుకీ మరింత బలపడుతూ వెళ్లడంతో – నయన పెళ్లి విఘ్నేష్ తోనే అని జనాలు ఫిక్సయిపోయారు. ఆ మాటలకు మరింత బలాన్నిస్తూ నయన్ – విఘ్నేష్ ప్రపంచమంతా చక్కర్లు కొడుతూ కనిపించేవారు. నయనతార ఫొటో ఒకటి సోషల్ మీడియాలో కనిపించిందంటే – అది విఘ్నేష్ తోనే అన్నట్టు తయారైంది వ్యవహారం. వీరిద్దరికీ ఆల్రెడీ పెళ్లయిపోయిందని, కానీ ఆ విషయం బయటకు చెప్పడం లేదని – అనుకున్నారు.
అయితే ఎట్టకేలకు ఈ విషయంపై విఘ్నేష్ స్పందించాడు. “నయనని పెళ్లి చేసుకుంటా. పెళ్లంటే డబ్బులతో ముడిపడిన వ్యవహారం. నయనని పెళ్లి చేసుకోవడానికి డబ్బులు కూడబెడుతున్నా. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తరవాతే మా పెళ్లి“ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. నయనలో తనకు నచ్చిన లక్షణాలు, తమ ఇష్టాలూ ఏకరువు పెట్టాడు. నయన చీరకట్టులో బాగుంటుందని, చికెన్ కర్రీ బాగా వండుతుందని, భోం చేశాక ఓ మామూలు అమ్మాయిలా… గిన్నెలన్నీ తానే శుభ్రం చేస్తుందని చెప్పుకొచ్చాడు. సో.. నయన పెళ్లిపై మీడియాకు, ఆమె అభిమానులకు ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసినట్టైంది. బహుశా… ఈ యేడాదిలో వీరిద్దరి పెళ్లి ఉండొచ్చు.