నయనతార, ధనుష్.. ఇద్దరూ వివాదాలకు దూరంగా ఉండాలనుకొనేవాళ్లే. అయితే… నయనతార ఇప్పుడు ఓ లెటర్ విడుదల చేసింది. అందులో ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసింది. నయన రాసిన ఈ లేఖ… కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నయన, ధనుష్ ల మధ్య ఇన్ని విబేధాలు ఉన్నాయా? ఇద్దరి మధ్యా ఇంత కథ నడిచిందా? అంటూ అంతా ముక్కన వేలేసుకొంటున్నారు. అసలింతకీ ఈ లెటర్ లో ఏముంది? ధనుష్, నయనల మధ్య నడుస్తున్న వివాదం ఏమిటి?
‘నయన బియాండ్ ది ఫెయిరీ టెయిల్’ అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ సంస్థ నయనతార జీవిత విశేషాలపై ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈనెల 18న నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ‘నానుమ్ రౌడీ దాన్’ (తెలుగులో నేనూ రౌడీనే) సినిమా సమయంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. ఈ చిత్రానికి ధనుష్ నిర్మాత. అందుకే తన అనుమతి లేకుండా తన సినిమాకు సంబంధించిన క్లిప్స్ ఉపయోగించడం పట్ల ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీ రైట్ యాక్ట్ కింద తనకు రూ.10 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపాడు. ధనుష్, నయనతార మధ్య రాజీ కుదర్చడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. నయన ధనుష్కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ ధనుష్ వినలేదు. దాంతో నయన ఆగ్రహం కట్టలు తెంచుకొంది. అందుకే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కేవలం మూడు సెకన్ల వీడియో కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేయడం దారుణమని, ధనుష్ ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదని, కేవలం పాత కక్షల్ని, కోపాల్ని దృష్టిలో ఉంచుకొని ధనుష్ ఈ పని చేశాడంటూ నయన ఆరోపించింది. ధనుష్ పైకి ఒకలా, లోపల ఒకలా కనిపిస్తాడని, ఇతరులు ఎదిగితే సహించలేడని కాస్త ఘాటుగానే విమర్శలు చేసింది నయన. అసలు ధనుష్ కి మనస్సాక్షి లేదని, సినిమా విడుదలై పదేళ్లు దాటిపోయినా, ఆ సినిమాపై కాపీ రైట్ యాక్ట్ కింద డబ్బులు వసూలు చేయాలనుకోవడం, అది కూడా మూడు సెకన్ల క్లిప్పింగ్ కి ఇన్ని కోట్లు డిమాండ్ చేయడం దారుణమని వాపోయింది నయనతార. ‘నేనూ రౌడీనే’ హిట్టవ్వడం, కథానాయికగా తనకు పేరు రావడం చూసి ధనుష్ తట్టుకోలేకపోయాడని, తన అహం దెబ్బతిన్నదని, 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డుల సమయంలోనే తన అక్కసు బయటపెట్టుకొన్నాడని, పదేళ్ల నుంచీ ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు బయటపడ్డాడని నయన ఆరోపించింది. తమిళనాడు ప్రజలు ఇదంతా చూస్తూనే ఉంటారని, వాళ్లెప్పటికీ దీన్ని సహించరని తన లెటర్ లో రాసుకొచ్చింది నయన్.
నయన రాసిన సుదీర్ఘమైన ఉత్తరాన్ని క్షుణ్ణంగా చదివితే అర్థమయ్యేది ఒక్కటే. నయన, ధనుష్ ల మధ్య పాత గొడవలు చాలా ఉన్నాయి. వాటిని మనసులో పెట్టుకొని రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశాడు ధనుష్. దాంతో నయన ఇప్పుడు ఆ పాత గొడవలన్నీ మీడియా ముందు తీసుకురావాలని నిర్ణయించుకొంది. అందుకే ఈ ఉత్తరంతో ఓ కుదుపు కుదిపేసింది. మరి త్వరలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి. దీనికి ధనుష్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది మరింత ఆసక్తికరం.