తెలుగు, తమిళ్, హిందీ అని తేడాల్లేవ్! ఇంగ్లిష్లో సబ్ టైటిల్స్ వుంటే చాలు… సినిమాలు చూసేస్తున్నారు. అందులోనూ సినిమా పోస్టర్ మీద అమెజాన్ బొమ్మ కనపడితే చాలు… నెల రోజుల్లో ఎంచక్కా దర్జాగా అమెజాన్లో సినిమా చూసుకోవచ్చని థియేటర్లకు వెళ్లడం మానేస్తున్న ప్రేక్షకులు కొంతమంది వున్నారు. ఇటువంటి సమయంలో ‘ఇమైక్కా నోడిగల్’ సినిమాను తెలుగులో ‘అంజలి విక్రమాదిత్య’గా డబ్బింగ్ చేస్తున్న నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అమెజాన్లో ఈ సినిమా వచ్చి నెల అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట హిట్టయ్యింది. తెలుగులోనూ క్రేజ్ ఉన్న నయనతార, రాశీ ఖన్నా నటించిన ఈ సినిమాలో హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్గా చేశారు. అందువల్ల, మెట్రో సిటీల్లోని ఆడియన్స్ చాలామంది సినిమా చూశారు. ఈ సినిమాకు టార్గెట్ ఆడియన్స్ కూడా వాళ్లే. తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారని తెలియడం వల్ల చూసే ఆడియన్స్ కొంతమంది వుంటారు. ఈ నేపథ్యంలో తెలుగలో సినిమాకు ఆదరణ ఏమాత్రం దక్కుతుందనేది చూడాలి.