నయీం కేసు గుర్తుందా? కొన్ని వారాల పాటు మీడియాలో మార్మోగిన వ్యవహారం.. ఎంతటి వారినైనా వదిలేది లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో గర్జించిన వ్యవహారం.. ఇప్పుడు ఎంతటివారినీ అంటుకోకుండానే కేసు దర్యాప్తు పరిసమాప్తికొచ్చేసిందట. ప్రధానంగా నల్గొండ భువనగిరి జిల్లాలలో 270కి పైగా భూ కబ్జాలు అపహరణలు హత్యలు వంటి ఫిర్యాదులున్న ఈ కేసులో 130 మందిని అరెస్టు చేశారు. ప్రభుత్వం నియమించిన సిట్ 880 మంది సాక్షులను విచారించింది. కొంతమంది పాలకపక్ష ప్రముఖులతో సహా రాజకీయ నేతల పేర్లు వినిపించినా చివరకు పోలీసు అధికారులకే పరిమితమైంది. నయీంను సమాచార సేకరణకు ఉపయోగించవలసిందిగా మీరే ఆదేశించి ఆయనతో కలసి వున్న ఫోటోల కారణంగా అరెస్టు చేయడమేమిటని కూడా సదరు పోలీసు అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే కలసి వున్నందుకు గాక కలసి నేరాలలో పాలు పంచుకున్నవారినే పట్టుకున్నట్టు ప్రభుత్వం వివరణ ఇస్తున్నది. ఏదైతేనేం రాజకీయంగా పెద్ద తలకాయలు మాత్రం బయిటకు రాకుండానే నయీం కేసుకు మంగళం పాడటం తథ్యంగా కనిపిస్తున్నది.
ఈ సమయంలోనే కకునూరు ఎస్ఐ ప్రభాకరరెడ్డి ఆత్మహత్యపైనా సంగారెడ్డి డిఎస్పి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చేశారు. బ్యుటిషియన్ శిరీష పట్ల తప్పుగా ప్రవర్తించిన సంగతి బయిటకు వస్తుందనే ఆయన ప్రాణాలు తీసుకున్నారని నివేదికలో చెప్పినట్టు సమాచారం. అయితే అదే సమయంలో అధికారుల వేధింపుల గురించి ఆయన ముందే ఫిర్యాదు చేసిన సంగతి కూడా నివేదికలో పొందుపర్చినట్టు తెలుస్తున్నది. ఏమైనా ఇది కూడా ఇక క్లోజే!