మాజీ చిల్లర దొంగ, మాజీ నక్సలైట్, మాజీ పోలీస్ కోవర్ట్, కొందరు పోలీసు అధికారులకు ఆప్తుడని పేరు పొందిన నయీం హతమయ్యాడు. హైదరాబాదుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో గ్రేహౌండ్స్, సివిల్ పోలీసుల ఆపరేషన్లో నయీంను ఎన్ కౌంటర్లో కాల్చిచంపారు.
ఈ ఎన్ కౌంటర్ ఎపిసోడ్ లో హైడ్రామా చోటు చేసుకుంది. జీహాదీ టెర్రరిస్టులు దాక్కున్నారనే సమాచారంతో ఎన్ ఐ ఎ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిందని ప్రచారం జరిగింది. షాద్ నగర్ లోని ఘటనా స్థలి పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించలేదు. చివరకు అది నయీం ఎన్ కౌంటర్ అని తేలిపోయింది. హతుడు నయీం అని భావిస్తున్నామని, ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని ఎస్పీ ప్రకటించారు.
ఒకప్పుడు నక్సలైటుగా అజ్నాత వాసం గడిపిన నయీం, ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్యతో పాటు ఇంకా చాలా హత్య కేసుల్లో నిందితుడు. అతడిమీద వందకు పైగా కేసులున్నాయి. అయితే, ఇంత హటాత్తుగా అతడు ఎన్ కౌంటర్లో హతం కావడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. కొందరు పోలీసు ఉన్నతాధికారులతో పాటు నల్గొండ, ఇతర జిల్లాల్లోని చాలా మంది రాజకీయ నాయకులకు అతడు ఆప్తుడనే ప్రచారం చాలా కాలంగా ఉంది. అతడిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించిన అధికారులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారని కూడా ఊహాగానాలు వినవచ్చాయి.
ఎంత మందిని బెదిరించినా, ఎంత మందిచి హత్య చేయించిన నయీం మీద ఈ వాలదని భువనగిరి తదితర ప్రాంతాల్లో టాక్. అరెస్టు చేయాల్సిన శాఖలోనే కొందరు శ్రేయోభిలాషులు ఇన్ ఫార్మర్లు ఉండటం నిజమైతే ఇక పట్టుకునేది ఎవరు?
నయీం దందాలకు అడ్డూ అదుపూ లేదు. భూకబ్జాలకు అంతే లేదు. గ్రేటర్ హైదరాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో నయీం ముఠా కబ్జా చేసిన స్థలం 50 వేల ఎకరాలకు పైగా ఉన్నా ఆశ్చర్యం లేదంటారు. పోలీసులు, అధికారంలో ఉన్న కొందరి అండ లేకపోతే ఈ స్థాయిలో బాహాటంగా కబ్జాలు చేయడం సాధ్యం కాదన్నది నయీం గురించి జరిగిన ప్రచారం.
నయీం ఎన్ కౌంటర్ తర్వాత అల్కాపురి కాలనీలో అతడికి సంబంధించిన ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అక్కడ కనిపించిన నోట్ల కట్టలు చూసి నోరెళ్లబెట్టారు. కనీసం 20 కోట్ల రూపాయల నగదు, భారీగా బంగారం, స్థలాలకు సంబంధించిన దస్తావేజులు ఇతర వస్తువులు లభించాయి.
నల్గొండ జిల్లాలో నయీం సోదరిని, బావను పోలీసులు అరెస్టు చేశారు. మూడు జిల్లాల్లో ఆ గ్యాంగ్ సభ్యుల కోసం వేటాడుతున్నారు. వీలైనంత మంది గ్యాంగ్ సభ్యులను పట్టుకుంటామని పోలీసలు చెప్తున్నారు. మొత్తానికి, నయీం ఎన్ కౌంటర్ తో ఓ బడా కబ్జాదారు, బ్లాక్ మెయిలర్ పీడ విరగడైందని అతడి బాధితులు ఊరటచెందారు.