వైకాపా తరపున ఏకగ్రీవంగా రాజ్యసభకి ఎన్నికయిన విజయసాయి రెడ్డికి సిబిఐ కోర్టు ఇవ్వాళ్ళ పెద్ద షాక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టుకి హాజరుకానందుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆరోగ్య కారణాలను చూపి కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో సిబిఐ కోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డితో బాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వాళ్ళ కోర్టుకి హాజరుకాకపోవడంతో ఆయనకు కూడా వారెంట్ జారీ చేశారు. అనంతరం కేసుని జూన్ 10కి వాయిదా వేశారు.
ఇది వారిద్దరికీ ఊహించని షాక్ అనే చెప్పవచ్చు. ఇదివరకు వాళ్లిద్దరూ ప్రతీ శుక్రవారంనాడు జరిగే కోర్టు విచారణకు హాజరవ వలసి వచ్చేది. రాజకీయాలలో ఉన్న కారణంగా తమకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు కోరడంతో సిబిఐ కోర్టు అందుకు అంగీకరించి, మూడు నెలలకొకసారి కోర్టు విచారణకి హాజరవవచ్చని మినహాయింపు ఇచ్చింది. ఆ కారణంగా జగన్, విజయ సాయి రెడ్డి ఇద్దరూ బంధ విముక్తులైనట్లయింది. ప్రతీ శుక్రవారం కోర్టుకి వెళ్లి హాజరు వేయించుకొంటున్నారనే తెదేపా నేతల ఎత్తిపొడుపు మాటల నుంచి కూడా వారిరువురికీ కొంత ఉపశమనం దొరికింది.
ప్రస్తుతం రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరుగుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో వారిరువురిపై సిబిఐ కోర్టు వారెంట్లు జారీ చేయడంతో తెదేపా నేతలు ఎదురుదాడి చేయడం తధ్యం కనుక జగన్ ఆత్మరక్షణ చేసుకోవలసిన పరిస్థితి కలిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన చాలా సంతోషిస్తున్న విజయసాయి రెడ్డికీ ఇది పెద్ద షాకే. ఈ కేసుల కారణంగా తీవ్ర అప్రదిష్ట మూటగట్టుకొన్న ఆయన, రాజ్యసభకి ఎంపిక అవడంతో అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ సమయంలోనే నాన్-బ్యిలబుల్ అరెస్ట్ వారెంట్ రావడం జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. అయితే ఆ వారెంట్లను ఉపసంహరింపజేసుకోవడం పెద్ద పనేమీ కాదు కనుక అది వారికి కేవలం చిన్న ఇబ్బంది మాత్రమే కానీ తెదేపా నేతల దాడిని ఎదుర్కోవడమే ఇప్పుడు వారికి పెద్ద సవాలు కావచ్చు.