రైతు కథల్ని ఇప్పట్లో వదిలేటట్టు లేరు మనవాళ్లు. ఖైది నెంబర్ 150 రైతు సమస్య ఆధారంగా తెరకెక్కింది. మహర్షి అచ్చంగా రైతుల సినిమా. బాలకృష్ణ రూలర్లోనూ రైతుల గురించి మాట్లాడారు. మొన్న వచ్చిన భీష్మలోనూ వ్యవసాయం పాయింట్ అంతర్లీనంగా టచ్ చేశారు. శర్వానంద్ సినిమా శ్రీకారం కూడా ఇలాంటి కథే. ఇప్పుడు బాలకృష్ణ – బోయపాటి శ్రీను సినిమా కూడా రైతు సమస్య మీదనే అని సమాచారం.
సింహా, లెజెండ్ తరవాత బాలయ్య – బోయపాటి కాంబో మళ్లీ రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. అంజలి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు బాలయ్యలు కనిపిస్తారు. తొలి సగం అనంతపురం నేపథ్యంలో సాగుతుంది. అక్కడ రైతుల సమస్యలపై కథానాయకుడు పోరాటం చేస్తుంటాడు. అతనికి ఆ జిల్లా కలెక్టర్ (అంజలి) సహాయ సహకారాలు అందిస్తుంటుంది. సెకండాఫ్‌లో కథ కాశీ షిఫ్ట్ అవుతుంది. ఆ తరవాత సినిమా కలర్ మొత్తం మారిపోతుంది. టేకాఫ్ కోసం రైతు పాయింట్‌ని తీసుకున్నాడు దర్శకుడు. అయితే ఇప్పటికే రైతుల సమస్యలు, వాళ్ల కష్టాలు, కన్నీళ్లు, కథానాయకుల పోరాటాలూ చూసీ చూసీ అలసిపోయారు ప్రేక్షకులు. మరి ఇందులోనే బోయపాటి ఎలాంటి వైవిధ్యం చూపించదలచుకున్నాడో..?