చిత్రసీమలో… విజయమే మాట్లాడుతుంది. హిట్టు తప్ప దేని మాటా చల్లదు. ఓ హిట్టు దొరికితే చాలు… చిన్నవాళ్లు స్టార్లైపోతారు. దర్శకులైనా, హీరోలైనా అంతే. దర్శకుడు సంతోష్ శ్రీన్వాస్ కూడా ఒక్క సినిమాతో పెద్ద హీరోల దృష్టి లో పడ్డాడు. `కందిరీగ` హిట్టవ్వడంతో… ఏకంగా ఎన్టీఆర్ పిలిచి అవకాశం ఇచ్చాడు. కానీ `రభస`తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సంతృప్తిపరచలేకపోయాడు. మళ్లీ రామ్ `హైపర్` తో ఛాన్స్ ఇచ్చినా.. దాన్నీ నిలబెట్టుకోలేదు. ఎట్టకేలకు బెల్లంకొండ శ్రీనివాస్ ని ఒప్పించి `అల్లుడు అదుర్స్`కి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాపై అన్నో కొన్నో ఆశలు ఉండేవి. `అల్లుడు అదుర్స్` విడుదలకు ముందు వచ్చిన బజ్ చూసి కొంతమంది హీరోలు సంతోష్ శ్రీనివాస్ పై దృష్టి పెట్టారు. అల్లుడు ఆడితే… ఛాన్స్ ఇద్దామనుకున్నారు.కానీ.. `అల్లుడు అదుర్స్` కాస్త డిజాస్టర్‌గా తేలిపోవడంతో – ఇప్పుడు వాళ్లంతా సైడ్ అయిపోయారు.
ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో.. బాలయ్య కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నాడు సంతోష్. `బలరామయ్య బరిలోకి దిగితే` అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. `బాలయ్యతో తప్పకుండా సినిమా చేస్తా` అని చాలాసార్లు చెప్పాడు కూడా. అయితే.. ఇప్పుడు ఆ ఛాన్స్ ఉండకపోవొచ్చు. బాలయ్యే కాదు.. `అల్లుడు శ్రీను` చూశాక.. ఏ హీరో కూడా… సంతోష్ తో సినిమా చేసే రిస్క్ చేయకపోవొచ్చు. కొంతకాలం.. సంతోష్‌కి హీరోలు దొరకడం కష్టమే. గొప్ప కథేమైనా రాసుకోగలిగితే తప్ప. బాలయ్య వ్యవహారం కూడా కొంత విచిత్రంగా ఉంటుంది. ఏరి కోరి ఫ్లాప్ దర్శకుల్ని ఎంచుకుని సినిమాలు పట్టాలెక్కించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అయితే ప్రస్తుతం బాలయ్య ఉన్న బిజీ పరిస్థితుల దృష్ట్యా… ఆ ఛాన్సు కూడా లేదు. సో.. కొంతకాలం సంతోష్ కి బ్రేక్ తప్పకపోవొచ్చు.