అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం వచ్చింది.. వెళ్లింది.బాలయ్య, ఎన్టీఆర్‌లని ఒకే వేదికపై చూడాలని ఏడేళ్ల నుంచి ఆరాటపడుతున్నారు అభిమానులు. `అరవింద సమేత వీర రాఘవ` సక్సెస్ మీట్ ఆ లోటు తీర్చేసింది. ఆదివారం రాత్రి శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య అతిథిగా వచ్చాడు. కానీ ఈ కార్యక్రమం వల్ల నందమూరి ఫ్యాన్స్‌కి ఒరిగిందేమీ లేదా? బాలయ్య రాక.. కేవలం మొక్కుబడి తంతుగా జరిగిందా? `అరవింద` సక్సెస్ మీట్ చూసినవాళ్లందరి మెదళ్లలో మొలిచే ప్రశ్న ఇదే.
దానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి… నందమూరి బాలకృష్ణ `అరవింద సమేత వీర రాఘవ` సినిమా చూడలేదు. సాధారణంగా సక్సెస్మీట్లకు వచ్చేటప్పుడు ఆయా సినిమాల్ని చూడడం ఆనవాయితీ. లేదంటే సినిమా గొప్పదనం గురించి ఎలా మాట్లాడతారు, ప్రేక్షకులకు ఏం చెబుతారు? కానీ ఇక్కడ బాలయ్య సినిమాచూడలేదు. `ఎన్టీఆర్` బయోపిక్ బిజీలో ఉండడం వల్ల ఈ సినిమా చూడలేకపోయా.. అంటున్నారు బాలయ్య. సో.. అది కూడా ఓకే అనుకుందాం.
ఈ వేదికపై బాలయ్య నోటి నుంచి ఒకే ఒక్కసారి `జూనియర్ ఎన్టీఆర్` అనే ప్రస్తావన వచ్చింది. బాలయ్య సుదీర్ఘంగా పది నిమిషాలు సంభాషిస్తే.. అందులో ఒకే ఒక్కసారి ఎన్టీఆర్ పేరు ఉచ్ఛరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఆఖరికి రామ్ లక్ష్మణ్ ప్రతిభా పాటవాల గురించి అనర్గళంగా మాట్లాడిన బాలయ్య, పూజా హెగ్డేని హిందీ, ఇంగ్లీష్ ఉపమానాలతో పొగిడేసిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ నటన గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడకపోవడం చూస్తుంటే… `బాలయ్యకు ఎన్టీఆర్ అనే పేరు పలకరించడం కూడా నచ్చలేదా` అనే అనుమానాలు కలగడం సహజం.
పోనీ.. బాబాయ్ గురించి ఎన్టీఆర్ ఏమైనా చెప్పాడా అంటే.. ఒకే ఒక్క మాటతో ముగించాడు. `నాన్న లేని లోటుని తీర్చడానికి మా బాబాయ్ ఇక్కడికి వచ్చారు` అంటూమైకు బాబాయ్‌కి అప్పగించాడు. ఈ వేదికపై ఎన్టీఆర్ ఇలాంటి డైలాగ్ వదులుతాడని అందరూ ఊహించినదే. అందులో విచిత్రం ఏమీ లేదు. అంతకు మించి ఎన్టీఆర్ కూడా ఏం మాట్లాడలేదు. వ్యవహారం చూస్తుంటే.. బాలయ్య ఎవరిదో బలవంతంపై ఇక్కడి వరకూ వచ్చినట్టు. ఎన్టీఆర్ కూడా `సరే..` అంటూ ఒప్పుకున్నట్టు కనిపిస్తోంది తప్ప… ఎన్టీఆర్ – బాలయ్యల మధ్య ఏర్పడిన గ్యాప్‌ని ఈ వేడుక తగ్గించేస్తుందని మాత్రం అనిపించడం లేదు.