కొంతమంది దర్శకులు ఈమధ్య ప్యాకేజీ సిస్టం మొదలెట్టారు. సినిమాకి ఇంత అని ముందే చేతిలో పెట్టేస్తే… సినిమా తీసి పెట్టేస్తారన్నమాట. అంటే.. రాసుకొన్న బడ్జెట్ పెరిగిపోవడం, ఆ తరవాత నిర్మాత అప్పులు తీసుకొచ్చి సినిమాని పూర్తి చేయడం ఇవేం ఉండవన్నమాట. బడ్జెట్ ఇంతా అని ఇచ్చేస్తే… మిగిలింది దర్శకుడు చూసుకొంటాడు. అలా.. నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్‌ల సినిమా కూడా ప్యాకేజీ లిస్టులో చేరిపోయిందని టాక్. భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత పూరి చేతిలో రూ.35 పెట్టారట. బాలయ్య పారితోషికంతో సహా.. పూరి పారితోషికంతో సహా అన్నీ ఇందులోనే చూసుకోవాలన్నమాట. బాలయ్య పారితోషికం రూ.10 కోట్లు అనుకొంటే మిగిలింది రూ.25 కోట్లు. ఇందులోనే పూరి తన పారితోషికం తీసుకొని, సినిమా పూర్తి చేయాలన్నమాట.
అందుకే పూరి కొత్త కథానాయికల వెంట పడుతున్నాడని, వాళ్లయితే పారితోషికం ఇవ్వక్కర్లేదని, ఉన్నంతలో సినిమాని క్వాలిటీగా తీయొచ్చని స్కెచ్చులు వేశాడు. పూరి పారితోషికం ఎంత కాదన్నా రూ. 8 కోట్లు ఉంటుంది. అంటే మేకింగ్ కోసం రూ.17 కోట్లు మిగిలాయన్నమాట. ఈ సినిమాని రూ.50 కోట్ల వరకూ అమ్ముకొంటే నిర్మాతకి రూ.15 కోట్ల టేబుల్ ప్రాఫిట్ మిగులుతుంది. అందుకే.. పూరి రూ.35 కోట్లలో సినిమా తీసి పెడతానని మాట ఇవ్వగానే భవ్య క్రియేషన్స్ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చేసింది… ఆఘమేఘాల మీద పట్టాలెక్కించేసింది.