బ్యాంకులను మోసం చేసి లండన్ పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాని అరెస్ట్ చేసేందుకు ఈడిలోని మనీ లాండరింగ్ కేసులను విచారించే ప్రత్యేక కోర్టు సోమవారన్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం విజయ్ మాల్యా ఐ.డి.బి.ఐ. బ్యాంకు వద్ద నుంచి రూ. 900 కోట్లు అప్పు తీసుకొని దానిలో నుంచి రూ. 430 కోట్ల రూపాయలను విదేశాలలో పెట్టుబడులకు మళ్లించినట్లు ఈడి గుర్తించింది. ఆ కేసులో విచారణకు హాజరు కమ్మని విజయ్ మాల్యాకి నోటీసులు పంపినా ఆయన రాకపోవడంతో ఆ కేసును విచారిస్తున్న ఈడి ప్రత్యేక కోర్టుకి పిర్యాదు చేయగా న్యాయమూర్తి జస్టిస్ పి.ఆర్.భవకే విజయ్ మాల్యా అరెస్టుకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు రోజుల క్రితమే ఈడి అభ్యర్ధన మేరకు డిల్లీలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం, విజయ్ మాల్యా పాస్ పోర్ట్ ని నెలరోజుల పాటు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వారం రోజులలోగా సమాధానం ఇవ్వనట్లయితే శాస్వితంగా పాస్ పోర్ట్ ని రద్దు చేస్తానని హెచ్చరించింది. విజయ్ మాల్యా లండన్ పారిపోయినప్పటికీ ఈడి చేపడుతున్న ఈ చర్యల వలన అయన ఇవ్వాళ్ళ కాకపోతే రేపయినా తప్పనిసరిగా వెనక్కి తిరిగిరాక తప్పేలా లేదు.