బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎప్పుడూ చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో కలిసి జనత పరివార్ తో జత కట్టిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) లాలూ, నితీష్ చెరో వంద సీట్లు పన్సుసుకొని కాంగ్రెస్ కి 40 సీట్లిచ్చి మిగిలిన ముష్టి మూడు సీట్లు పడేయడంతో అలిగిన ఎన్.సి.పి, ములాయం సింగ్ తో జనతా పరివార్ నుండి బయటకి జంప్ అయిపోయింది. తరువాత ములాయం సింగ్ ని నమ్ముకొని మరో ఐదు లోకల్ పార్టీలు కూడా వచ్చి చేరడంతో ఆ గ్రూప్ కాస్తా తృతీయ ఫ్రంట్ అని ముద్దుపేరు పెట్టుకొని తాము కూడా జనతా పరివార్, ఎన్డీయే, వామపక్షాల కూతములకి ఏమాత్రం తీసిపోమని భుజాలు చరుచుకొంది. అంత వరకు బాగానే ఉంది. కానీ ఎన్నికల ప్రచార సమయంలో తమ తృతీయ ఫ్రంట్ కి ప్రచారం చేయవలసిన ములాయం సింగ్ బీజేపీకి ప్రచారం చేయడం మొదలుపెట్టేసరికి తృతీయ బ్యాచ్ షాక్ అయిపోయింది.
మొన్న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ములాయం సింగ్ ప్రసంగిస్తూ “ఈసారి ఎన్నికలలో బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఆ పార్టీయే బీహార్ లో అధికారంలోకి రావచ్చని జోస్యం చెప్పారు. అంతకు ముందు మోడీ పాలనను, బీజేపీ జాతీయవాదానికి గుడ్ సర్టిఫికేట్ ఇచ్చేరు. ఇదంతా చూస్తుంటే ములాయం సింగ్ ఎన్నికల ప్రచారంలో మోడీకి, బీజేపీకి ఏజెంట్ గా పనిచేస్తున్నారా? మోడీ ఆదేశాలతోనే ఆయన తృతీయ ఫ్రంట్ కి ఈవిధంగా శల్యసారధ్యం చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది తృతీయ ఫ్రంట్ జనాలకి.
ములాయం సింగ్ కొడుతున్న ఈ కంకు దెబ్బలకి ఓర్చుకోలేక ఎన్.సి.పి తృతీయ ఫ్రంట్ లో నుంచి మళ్ళీ బయటకి జంప్ చేసేసింది. మేము కాంగ్రెస్, బీజేపీలకి వ్యతిరేకంగా పోరాదేందుకే ఈ తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొంటే ములాయం సింగ్ మళ్ళీ ఆ బీజేపీకే వంత పాడటం మాకు డైజెస్ట్ అవ్వడం లేదు అని గుడ్ బై చెప్పేసింది. అయితే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడాలనుకొన్న ఎన్.సి.పి మొదట అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి జనతా పరివార్ లో సిద్దాంతాలు, లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఏవేవో పడికట్టు పదాలు చెప్పిన విషయం కన్వీనియంట్ గా మరిచిపోయిందిప్పుడు…అదే అసలు సిసలు రాజకీయ పార్టీ లక్షణం.